అమ్మాయిల ఆటకట్టు!

24 Nov, 2018 00:43 IST|Sakshi

సెమీ ఫైనల్లో చిత్తుగా ఓడిన భారత జట్టు  

112 పరుగులకే ఆలౌట్‌ 

8 వికెట్లతో ఇంగ్లండ్‌ ఘన విజయం 

తొలిసారి ఐసీసీ టోర్నీని గెలుచుకోవాలని ఆశించిన భారత మహిళల జట్టుకు సెమీ ఫైనల్లోనే భంగపాటు ఎదురైంది. ఏడాది క్రితం వన్డే ఫైనల్లో మన ఆశలు కూల్చిన ఇంగ్లండ్‌ ఈసారి మరో అడుగు ముందే టీమిండియా ఆట కట్టించింది. సీనియర్‌ ప్లేయర్‌ను పక్కన పెట్టిన వ్యూహాత్మక తప్పిదం మొదలు పిచ్‌కు తగినట్లుగా ఆటతీరును మార్చుకోలేక బ్యాటింగ్‌లో కుప్ప కూలడం, ఆపై ఆరుగురు స్పిన్నర్లు కూడా ప్రత్యర్థిపై ప్రభావం చూపలేకపోవడంతో మన పోరు తుది సమరానికి చేరక ముందే ముగిసి పోయింది. లీగ్‌ దశలో వరుసగా నాలుగు విజయాలతో జోరు మీద కనిపించిన హర్మన్‌ సేన అసలు ఆటలో మాజీ చాంపియన్‌ ముందు నిలవలేక చేతులెత్తేసింది.  

నార్త్‌ సౌండ్‌ (ఆంటిగ్వా): మహిళల టి20 ప్రపంచ కప్‌ టోర్నీలో భారత జట్టు మూడోసారి సెమీఫైనల్‌కే పరిమితమైంది. గతంలో రెండు సార్లు సెమీస్‌ చేరిన టీమిండియా ఈసారి అద్భుతమైన ఫామ్‌లో ఉండి కూడా ఆ అడ్డంకిని అధిగమించలేకపోయింది. శుక్ర వారం తెల్లవారు జామున ఇక్కడి సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ స్టేడియంలో జరిగిన రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌ జట్టు 8 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 19.3 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది. స్మృతి మంధాన (23 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్‌), జెమీమా రోడ్రిగ్స్‌ (26 బంతుల్లో 26; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. టాప్‌–4 మినహా మిగతా ఏడుగురు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హీతర్‌ నైట్‌ (3/9), కిర్‌స్టీ గార్డన్‌ (2/20), ఎకెల్‌స్టోన్‌ (2/22) భారత్‌ను దెబ్బ తీశారు. భారత్‌ ఇన్నింగ్స్‌లో మూడు రనౌట్‌లు ఉన్నాయి. అనంతరం ఇంగ్లండ్‌ 17.1 ఓవర్లలో 2 వికెట్లకు 116 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అమీ జోన్స్‌ (47 బంతుల్లో 53 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), నటాలీ స్కివర్‌ (38 బంతుల్లో 52; 5 ఫోర్లు) మూడో వికెట్‌కు అభేద్యంగా 92 పరుగులు జోడించారు. ఆదివారం జరిగే ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్‌ తలపడుతుంది.  

23 పరుగులకే 8 వికెట్లు... 
స్మృతి మంధాన తనదైన శైలిలో దూకుడుగా ఇన్నింగ్స్‌ను ఆరంభించడంతో భారత్‌కు శుభారంభమే లభించింది. 13 పరుగుల వద్ద ఆమె ఇచ్చిన క్యాచ్‌ను ఎకెల్‌స్టోన్‌ వదిలేసింది. ఆ వెంటనే ఎకెల్‌స్టోన్‌ వేసిన తర్వాతి ఓవర్లోనే స్మృతి ఫోర్, సిక్సర్‌ బాదింది. అయితే చివరకు ఆమె ఓవర్లోనే రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి స్మృతి వెనుదిరిగింది. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 43 కాగా... ఆ ఓవర్‌ చివరి బంతికి భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. మరో ఓపెనర్‌ తాన్యా  (11) ప్రభావం చూపలేకపోయింది. అయితే హర్మన్‌ (20 బంతు ల్లో 16; 1 సిక్స్‌), జెమీమా కలిసి వేగంగా ఆడే ప్రయత్నం చేశారు. ఒక దశలో ఐదు బంతుల వ్యవధిలో 3 ఫోర్లు, 1 సిక్సర్‌ సహా భారత్‌ 19 పరుగులు రాబట్టింది. అయితే లేని రెండో పరుగు కోసం ప్రయత్నించి జెమీమా రనౌట్‌ కావడంతో ఆట మలుపు తిరిగింది. గార్డన్‌ ఒకే ఓవర్లో వేద కృష్ణమూర్తి (2), హర్మన్‌లను ఔట్‌ చేయగా... హీతర్‌ నైట్‌ వరుస బంతుల్లో హేమలత (1), అనూజ (0)లను డగౌట్‌ పంపించింది. రాధ (4) రనౌట్‌ కాగా, చివరి ఓవర్లో అరుంధతి (6), దీప్తి (7) ఔట్‌ కావడంతో మరో మూడు బంతుల ముందే జట్టు ఇన్నింగ్స్‌ ముగిసింది.  

అలవోకగా... 
స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై భారత బౌలర్లు ఆరంభంలోనే రెండు వికెట్లు తీసి కొంత ఆశలు రేపారు. రెండో ఓవర్లోనే బీమాంట్‌ (1)ను రాధ ఔట్‌ చేయగా...తడబడుతూ ఆడిన వ్యాట్‌ (8)ను దీప్తి వెనక్కి పంపించింది. అయితే ఈ దశలో జోన్స్, స్కివర్‌ సమర్థంగా ప్రత్యర్థి బౌలింగ్‌ను ఎదుర్కొన్నారు. భారత బ్యాటింగ్‌ను చూసిన అనుభవంతో ఎలాంటి సాహసాలకు పోకుండా చాలా జాగ్రత్తగా ఆడారు. పిచ్‌ను సరిగా అంచనా వేయడంలో వీరిద్దరు సఫలమయ్యారు. 2 పరుగుల వద్ద స్కివర్‌ ఇచ్చిన క్యాచ్‌ను పూనమ్‌ వదిలేయడం కూడా ఇంగ్లండ్‌కు కలిసొచ్చింది. ఆ తర్వాత ఎలాంటి తడబాటు లేకుండా వీరిద్దరు జట్టును లక్ష్యం దిశగా నడిపించారు. ఈ క్రమంలో ముందుగా స్కివర్‌ 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత అనూజ వేసిన 18వ ఓవర్‌ తొలి బంతికి ఫోర్‌ కొట్టిన జోన్స్‌ అర్ధసెంచరీతో పాటు మ్యాచ్‌ను కూడా ముగించింది.

‘హర్మన్‌ మోసకారి’
‘ఆమె అబద్ధాల కోరు, మోసకారి,  తారుమారు చేసే మనిషి, పరిణతి చెందలేదు. కెప్టెన్‌గా పనికి రాదు. మహిళల క్రికెట్‌ ఆట కంటే రాజకీయాలను ఎక్కువగా నమ్ముతుండటం దురదృష్టకరం’ అంటూ హర్మన్‌ప్రీత్‌పై మిథాలీ రాజ్‌ మేనేజర్‌ అనీషా గుప్తా నిప్పులు చెరిగింది. ఇంగ్లండ్‌తో సెమీస్‌లో మిథాలీని ఆడించకపోవడంపై తన ఆగ్రహాన్నంతా ట్విట్టర్‌లో వెళ్లగక్కింది.  

మరిన్ని వార్తలు