‘మెరుపు’ లకు ముస్తాబు

10 Mar, 2014 01:14 IST|Sakshi
‘మెరుపు’ లకు ముస్తాబు

బంగ్లా కోటలో ఇక అదిరే ఆట
 తొలిసారి టి20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం
 
 టెస్టు క్రికెట్ సంప్రదాయ భోజనం లాంటిది. కడుపు నిండుతుంది. టి20 క్రికెట్ చిరుతిండి (జంక్‌ఫుడ్) లాంటిది. ఇంకా తినాలనిపిస్తుంది. ఆరోగ్యకరం కాకపోయినా చిరుతిండిలోనే మజా. రోజంతా కూర్చుని క్రికెట్ చూడటం బోర్‌గా మారిన రోజుల్లో టి20లకు ఆదరణ పెరిగింది. అలాంటి టి20లో ప్రపంచ సమరం జరిగితే... ఎప్పుడెప్పుడా అని ఎదురు చూడాల్సిందే. ఇక ఆ సమయం వచ్చేసింది. బంగ్లాదేశ్‌లో టి20 ప్రపంచకప్‌కు రంగం సిద్ధమవుతోంది. మరో ఆరు రోజుల్లో పొట్టి ఫార్మాట్‌లో ధనాధన్ మెరుపులు చూడొచ్చు. 22 రోజుల పాటు కావలసినంత పరుగుల వినోదం.
 
  ఆసియా కప్‌ను సమర్థంగా నిర్వహించిన బంగ్లాదేశ్... ఇక ఓ మెగా టోర్నీనీ సూపర్ హిట్ చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. ప్రపంచంలోని ఎనిమిది అగ్రశ్రేణి జట్లతో పాటు పసికూనలుగా భావించే కొత్త జట్లు కూడా ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. 16 నుంచి మ్యాచ్‌లు ప్రారంభమవుతున్నా... ఇవి చిన్న జట్ల మధ్య అర్హత మ్యాచ్‌లు మాత్రమే. అసలు సిసలు హోరు 21 నుంచి మొదలవుతుంది. అది కూడా భారత్, పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్‌తో. టి20 ప్రపంచకప్‌కు సంబంధించిన అనేక విశేషాలతో ‘సాక్షి’ కౌంట్‌డౌన్ నేటి నుంచి...
 
 సాక్షి క్రీడావిభాగం
 తొలిసారి 2007లో మొదలైన టి20 ప్రపంచకప్ ఇప్పటికి నాలుగుసార్లు జరిగింది. టోర్నీలో అత్యధికంగా 12 జట్లు మాత్రమే ఆడాయి. ఈసారి మాత్రం ఆ సంఖ్యను ఐసీసీ 16కు పెంచింది. వన్డే ప్రపంచకప్‌లో జట్లను తగ్గించాలనే నిర్ణయం కారణంగా చిన్న దేశాలకు సమస్యలు రాకూడదని టి20 ప్రపంచకప్‌లో ఇక నుంచి 16 దేశాలను ఆడించాలని నిర్ణయించారు. అయితే దీనివల్ల టోర్నీ నాణ్యత దెబ్బతినకూడదు. దీంతో ప్రపంచకప్‌ను రెండు భాగాలుగా విభజించారు. ఎనిమిది అగ్రశ్రేణి జట్లు నేరుగా ప్రధాన మ్యాచ్‌లు ఆడేందుకు రెండు గ్రూపులుగా విడిపోయాయి. మిగిలిన 8 చిన్న దేశాలను కూడా రెండు గ్రూపులుగా చేసి అర్హత మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఇందులో గ్రూప్ స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్లు వెళ్లి ఎనిమిది పెద్ద జట్లతో పాటు ప్రధాన మ్యాచ్‌లు ఆడతాయి. గత టోర్నీ వరకు ఉన్న సూపర్ సిక్స్ మ్యాచ్‌లను ఈసారి తీసేశారు.
 
 మూడు కొత్త జట్లు
 ఈసారి టి20 ప్రపంచకప్ ద్వారా మూడు కొత్త జట్లు ఈ ఫార్మాట్‌లో తొలిసారి ఆడబోతున్నాయి. నేపాల్, హాంకాంగ్, యూఏఈ అర్హత మ్యాచ్‌లలో బరిలోకి దిగుతున్నాయి. ఆతిథ్య బంగ్లాదేశ్‌తో పాటు, ఆ జట్టును ఆసియాకప్‌లో కంగుతినిపించిన అఫ్ఘానిస్థాన్, జింబాబ్వే, నెదర్లాండ్స్, ఐర్లాండ్ మిగిలిన జట్లు.
 
 అర్హత రౌండ్
 గ్రూప్ ‘ఎ’: బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్, నేపాల్, హాంకాంగ్
 గ్రూప్ ‘బి’:జింబాబ్వే, ఐర్లాండ్, యూఏఈ, నెదర్లాండ్స్
 ఈ రెండు గ్రూప్‌ల నుంచి విజేతలుగా నిలిచిన జట్లు ప్రధాన దశకు అర్హత సాధిస్తాయి.
 
 ప్రధాన రౌండ్ (సూపర్ 10 సిరీస్)
 గ్రూప్-1: శ్రీలంక, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, క్వాలిఫయర్ (గ్రూప్ ‘బి’ విజేత)
 గ్రూప్-2: భారత్, వెస్టిండీస్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, క్వాలిఫయర్ (గ్రూప్ ‘ఎ’ విజేత)
 గ్రూప్-1, గ్రూప్-2 లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరతాయి.
 
 మార్చి 16 నుంచి 21 వరకు అర్హత రౌండ్ మ్యాచ్‌లు జరుగుతాయి.  మార్చి 21 నుంచి ఏప్రిల్ 1 వరకు ప్రధాన గ్రూప్‌ల మ్యాచ్‌లు జరుగుతాయి.  ఏప్రిల్ 3, 4 తేదీల్లో సెమీఫైనల్స్ జరుగుతాయి.   ఏప్రిల్ 6న ఫైనల్ జరుగుతుంది. ఒకవేళ ఏదైనా అంతరాయం కలిగితే రిజర్వ్ డే 7న మ్యాచ్ జరుగుతుంది.
 
 మహిళలూ సిద్ధం
 పురుషుల టోర్నీతో సమాంతరంగా మహిళలకూ టి20 ప్రపంచకప్ జరుగుతుంది. పురుషులకు ఇది ఐదో టి20 ప్రపంచకప్ కాగా... మహిళలకు మాత్రం నాలుగోది. 2009లో తొలిసారి పురుషులతో పాటు మహిళలకూ టోర్నీ నిర్వహణ ప్రారంభమైంది. మహిళల జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు.
 గ్రూప్ ‘ఎ’: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, ఐర్లాండ్
 గ్రూప్ ‘బి’: భారత్, ఇంగ్లండ్, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్
 రెండు గ్రూప్‌లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరతాయి.
 
 ఎవరికెంతెంత?
 ఈసారి పురుషుల విభాగంలో విజేత జట్టుకు 11 లక్షల డాలర్లు (రూ. 6 కోట్ల 71 లక్షలు) ప్రైజ్‌మనీగా లభిస్తాయి. రన్నరప్ జట్టుకు 5 లక్షల 50 వేల డాలర్లు (రూ. 3 కోట్ల 35 లక్షలు) దక్కుతాయి. సెమీఫైనల్స్‌లో ఓడిన జట్లు 2 లక్షల 75 వేల డాలర్ల (రూ. కోటీ 67 లక్షలు) చొప్పున అందుకుంటాయి.
 
 ప్రధాన రౌండ్‌లో ప్రతి మ్యాచ్ విజయానికి 40 వేల డాలర్ల (రూ. 24 లక్షల 43 వేలు) చొప్పున లభిస్తాయి. మహిళల విభాగంలో విజేత జట్టుకు 70 వేల డాలర్లు (రూ. 42 లక్షల 75 వేలు)... రన్నరప్ జట్టుకు 30 వేల డాలర్లు (రూ. 18 లక్షల 32 వేలు) ప్రైజ్‌మనీగా దక్కుతాయి.
 

మరిన్ని వార్తలు