‘బాక్సింగ్‌ డే’ టెస్టుకు ప్రేక్షకుల్లేకుంటే ఎలా? 

29 Jun, 2020 00:15 IST|Sakshi

వీలైతే వేదిక మార్చాలన్నఆసీస్‌ మాజీ కెప్టెన్‌ మార్క్‌టేలర్‌

మెల్‌బోర్న్‌: ప్రపంచ క్రికెట్లోనే మేటి జట్లయిన భారత్, ఆస్ట్రేలియాలు తలపడితే పెద్ద సంఖ్యలో ప్రేక్షకులుండాలని... వాళ్లు లేకపోతే అది గొప్ప సిరీస్‌ అనిపించుకోదని ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ మార్క్‌ టేలర్‌ వ్యాఖ్యానించారు. ఇరుజట్ల మధ్య బాక్సింగ్‌ డే టెస్టును (డిసెంబర్‌ 26–30) పూర్తిస్థాయి సామర్థ్యమున్న స్టేడియంలో నిర్వహిస్తేనే మజా ఉంటుందని... ప్రేక్షకులు లేకుండా నిర్వహించే ఆలోచనను విరమించుకోవాలని అన్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈ టెస్టు వేదికను మెల్‌బోర్న్‌ నుంచి మార్చే అవకాశాలున్నాయి. మెల్‌బోర్న్‌ మైదానం ఉన్న విక్టోరియా రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దాంతో బాక్సింగ్‌ డే టెస్టు వేదిక మార్పు తప్పేలా లేదని క్రికెట్‌ ఆస్ట్రేలియా వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై టేలర్‌ మాట్లాడుతూ ‘క్రిస్మస్‌లాంటి సమయంలో ఇతరత్రా కారణాలతో స్టేడియంలో పది లేదా ఇరవై వేల ప్రేక్షకులతో మ్యాచ్‌ నిర్వహించాల్సి వస్తే అది గొప్ప సిరీస్‌ కానేకాదు. కరోనా అంతగా లేని పెర్త్, అడిలైడ్‌ ఓవల్‌ వేదికల్లో నిర్వహిస్తే చాలా మంది ప్రేక్షకులతో ఆట రంజుగా సాగుతుంది. పెర్త్, అడిలైడ్‌ మైదానాల్లో 55 వేలకంటే ఎక్కువ సీటింగ్‌ కెపాసిటీ ఉంది. అడిలైడ్‌లో అయితే భారతీయులు ఎగబడతారు. ప్రపంచకప్‌ (2015)లో భాగంగా భారత్, పాక్‌ల మధ్య ఇక్కడ జరిగిన మ్యాచ్‌ కోసం టికెట్లన్నీ 52 నిమిషాల్లోనే అమ్ముడైన సంగతి గుర్తుంచుకోవాలి’ అని అన్నారు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు