‘ఐపీఎల్‌లో రాణిస్తే.. వరల్డ్‌కప్‌ బెర్తు ఖాయం’

16 Mar, 2019 13:45 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ప్రదర్శన ఆధారంగా వరల్డ్‌కప్‌ జట్టు ఎంపిక ఉండదనేది గత కొన్ని రోజుల క్రితం చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌తో పాటు భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే వరల్డ్‌కప్‌కు సన్నాహకంలో భాగంగా ఆసీస్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్‌ ఆశించిన స్థాయిలో రాణించలేదు. స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌ను సైతం భారత్‌ కోల్పోయింది. దాంతో కొన్ని స్థానాల భర్తీ విషయంలో టీమిండియాకు ఇంకా స‍్పష్టత రాలేదు. ప‍్రధానంగా మూడో ఓపెనర్‌తో పాటు నాల్గో స్థానంపై చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అజింక్యా రహానే తన వరల్డ్‌కప్‌ బెర్తుపై ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇంక తన స్థానంపై ఎటువంటి స్పష్టత లేకపోయినప్పటికీ ఐపీఎల్‌లో రాణించి వరల్డ్‌కప్‌ బెర్తును కొట్టేస్తానంటున్నాడు రహానే. అయితే దీనిపై ఎక్కువగా ఆలోచించడం లేదన్నాడు. ‘ మనం ఏ టోర్నీ ఆడుతున్నామన్నది ముఖ్యం కాదు. కేవలం మనం ఆడే మ్యాచ్‌ల్లో పరుగులు చేయడంపైనే దృష్టి సారించాలి. ఇప్పుడు నా ముందున్న అవకాశం ఐపీఎల్‌. ఐపీఎల్‌లో రాణిస్తే వరల్డ్‌కప్‌కు వెళ్లే భారత జట్టులో చోటు కచ్చితంగా దక్కుతుంది. అయినా ఇప్పుడు వరల్డ్‌కప్‌ బెర్తు దక్కుతుందా లేదా అనే దాని గురించి ఆలోచించడం లేదు. రాజస్తాన్‌ రాయల్స్‌ను విజయ పథంలో నడిపించడంపైనే దృష్టి పెట్టా’ అని రహానే పేర్కొన్నాడు. గతేడాది ఐపీఎల్‌ సీజన్‌లో స్టీవ్‌ స్మిత్‌ గైర్హాజరీతో రాజస్తాన్‌ రాయల్స్‌కు రహానే కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ 176 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన రహానే.. 34 హాఫ్‌ సెంచరీలు, ఒక సెంచరీ సాయంతో 4,537 పరుగులు చేశాడు.

మరిన్ని వార్తలు