రాష్ట్రపతికి ఓ రూల్.. మాకో రూలా?

29 Jun, 2017 16:00 IST|Sakshi
రాష్ట్రపతికి ఓ రూల్.. మాకో రూలా?

న్యూఢిల్లీ:లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనలు అమలులో భాగంగా నూతనంగా ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటైన అనంతరం బీసీసీఐ మాజీ కార్యదర్శి నిరంజన్ షా తన స్వరాన్ని పెంచుతూ కొత్త లాజిక్ ను తెరపైకి తీసుకొచ్చారు. ప్రధానంగా 70 ఏళ్ల పైబడిన వారు బీసీసీఐ, దాని అనుబంధ సంస్థల్లో ఉండరాదన్న లోధా కమిటీ సిఫారుసును నిరంజన్ తీవ్రంగా తప్పుబట్టారు. భారత దేశ రాష్ట్రపతులుగా 70 ఏళ్లు పైబడిన వారు ఉండొచ్చు కానీ బీసీసీఐలో పనిచేసే వారికి అంత వయసు ఉండకూడదన్ననిబంధన ఏమిటని ప్రశ్నించారు. ఇక్కడ రాష్ట్రపతికి ఒక రూల్.. మాకో రూలా? అంటూ నిలదీశారు.

'బీసీసీఐ ఆఫీస్ బేరర్లకు వయసులో పరిమితి ఏమిటో అర్ధం కావడం లేదు. మన ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వయసు చూడండి 81ఏళ్లు. ఆయన 70 ఏళ్లు  కంటే తక్కువే ఉన్నారా. లేరు కదా. అటువంటప్పుడు బీసీసీఐలో పనిచేసేవారికి వయసులో నిబంధన విధించడం ఏమిటి. మనం ఫిట్ గా ఉంటే ఎంతకాలమైనా పని చేయవచ్చు. ఇది కచ్చితంగా ఒక రకమైన వివక్షే అని షా మండిపడ్డారు.

మరిన్ని వార్తలు