‘అది నో బాల్‌ కాకుంటే.. నా కథ ముగిసేది’

27 May, 2019 12:25 IST|Sakshi

లండన్‌: తన కెరీర్‌ను మలుపు తిప్పిందే ఒకే ఒక్క బంతి అని టీమిండియా ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ స్పష్టం చేశాడు. ఒక నో బాల్‌ కారణంగా తన కెరీర్‌ ఇంత వరకూ వచ్చిందని, అది లేకపోతే తన క్రికెట్‌ కథ ఎప్పుడో ముగిసి పోయేదని పేర్కొన్నాడు. ఇటీవల గౌరవ్‌ కపూర్‌ నిర్వహించిన బ్రేక్‌ ఫాస్ట్‌ విత్‌ చాంపియన్స్‌ షోలో భాగంగా తన గత అనుభవాల్ని విజయ్‌ శంకర్‌ పంచుకున్నాడు. ప్రధానంగా తన కెరీర్‌ను మలుపు తిప్పిన సంఘటనకు సంబంధించి అడిగిన ప్రశ్నకు విజయ్‌ శంకర్‌ సమాధానమిస్తూ.. ఒక దేశవాళీ మ్యాచ్‌లో శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన అద్భుతమైన బంతికి తాను బౌల్డ్‌ అయ్యానని, అది నో బాల్‌ కావడంతో 95 పరుగులు చేసి జట్టును గెలిపించానన్నాడు. అదే తాను భారత ‘ఎ’ జట్టుకు ఎంపిక కావడంతో పాటు ఇక్కడ వరకూ రావడానికి కారణమని ఒకనాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నాడు.

‘మొదటి సంఘటన నేను రంజీ ట్రోఫీ ఆడుతుంటే జరిగింది. నేను మా కెప్టెన్‌ లక్ష్య ఛేదనలో ఉన్నాం. మేమిద్దరం బాగా ఆడుతున్న సమయంలో మా కెప్టెన్‌ రనౌటయ్యాడు. తను ఔటయ్యాక మా జట్టు ఓడిపోయింది. ఆ తర్వాత నేను చాలా ఆత్మన్యూనతకు లోనయ్యా. మా కెప్టెన్‌, కోచ్‌తో ఎలాంటి సమస్య తలెత్తలేదు. కానీ బయటివారు మాటలు బాధించాయి. తమిళనాడు తరఫున ఇదే అతడి చివరి మ్యాచ్‌. దీని తర్వాత ఇంకెప్పుడూ ఇక్కడ ఆడలేడు’ అని విమర్శించారు. దాంతో నేను చాలా కృంగిపోయా. ఎలాగైనా రాణించాలనే లక్ష్యంతో శ‍్రమించా. ఈ క్రమంలోనే ముంబైతో చెన్నై మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్‌లో శార్దూల్‌ వేసిన ఒక బంతికి నేను బౌల్డ్‌ అయ్యా. అయితే అది నో బాల్‌. ఆ తర్వాత నేను 95 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించా. ఆపై నేను భారత‘ఎ’ జట్టుకు ఎంపిక కావడంతో పాటు జాతీయ జట్టులో చోటు సంపాదించాను. అది నో బాల్‌ కాకుంటే నా కథ అప్పుడే ముగిసి పోయేది’ అని విజయ్‌ శంకర్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం భారత వరల్డ్‌కప్‌ జట్టులో విజయ్‌ శంకర్‌ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు