పంత్‌ తోపన్నారు.. మరి ఎందుకు తీసుకోరు?

1 Feb, 2020 12:25 IST|Sakshi

న్యూఢిల్లీ: టీ20 వరల్డ్‌కప్‌కు సన్నాహకంలో భాగంగా టీమిండియా చేస్తున్న ప్రయోగాలను మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ విమర్శించాడు.  ప్రధానంగా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ను పక్కను పెట్టి మ్యాచ్‌లు ఆడటాన్ని ప్రశ్నించాడు. ఇదేనా వరల్డ్‌ టీ20కి సన్నాహకం అంటూ నిలదీశాడు. అసలు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఎందుకు పంత్‌ను పక్కను పెట్టాల్సి వచ్చిందని అడిగాడు. ఒక మెగా టోర్నీ ముందున్నప్పుడు కీలక ఆటగాడైన పంత్‌ను వరుసగా రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం చేయడం సమంజసం కాదన్నాడు.  గతంలో ఎంఎస్‌ ధోని కూడా ఇలానే తనతో పాటు సచిన్‌ టెండూల్కర్‌, గౌతం గంభీర్‌లను రొటేషన్‌ పద్ధతిలో ఆడించడానికి మొగ్గుచూపాడని తాము ఫీల్డింగ్‌లో చురుగ్గా లేకపోవడం వల్ల మా ముగ్గుర్నీ మార్చిమార్చి జట్టులోకి తీసుకుంటామని చెప్పాడని, ఇప్పుడు దాన్ని తలపిస్తున్నారని సెహ్వాగ్‌ ఎద్దేవా చేశాడు. (ఇక్కడ చదవండి: ‘సూపర్‌’ సీక్వెల్‌ )

‘ ఈ సమయంలో ఒక కెప్టెన్‌గా కోహ్లి..  పంత్‌తో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ధోనిని ఫాలో అవుతున్నాడో.. లేదో నాకు తెలీదు. జట్టు కూర్పులో నా పాత్ర కూడా ఏమీ ఉండదు. కానీ ఆసియా కప్‌కు రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించిన సమయంలో ప్లేయర్లు అందరితో మాట్లాడాడు. ఇప్పుడు కోహ్లి అలా చేస్తాన్నాడో.. లేదో నాకైతే కచ్చితంగా తెలీదు. గతంలో ధోని కెప్టెన్సీలో మమ్మల్ని సంప్రదించకుండానే రొటేషన్‌ పద్ధతి గురించి బహిరంగంగా ప్రకటన చేశాడు. మేము మీడియా ద్వారానే ఆ విషయం తెలుసుకున్నాం. ఇప్పుడు కోహ్లి కూడా అలానే చేస్తున్నాడా?, ఒకవేళ అలానే చేస్తే అది తప్పే. రిషభ్‌ పంత్‌ను మ్యాచ్‌ విన్నర్‌ అన్న కోహ్లి, మేనేజ్‌మెంట్‌లు, ఇప్పుడు అతన్ని ఎందుకు పక్కన కూర్చోబెడుతున్నారు.  (ఇక్కడ చదవండి: మనీష్‌ పాండే డబుల్‌ హ్యాట్రిక్‌)

పంత్‌ రిజర్వ్‌ ఆటగాడిగా పరిమితం చేస్తే పరుగులు ఎలా చేస్తాడు. సచిన్‌ టెండూల్కర్‌ను రిజర్వ్‌ బెంచ్‌లో కూర్చోబెడితే పరుగులు చేయగలడా. మీరు పంత్‌ తోపు అనుకుంటే అతన్ని ఎందుకు ఆడించడం లేదు’ అని సెహ్వాగ్‌ ప్రశ్నించాడు. కివీస్‌తో సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో పంత్‌ గాయపడటంతో తొలి వన్డేలో కీపింగ్‌ చేయలేదు. దాంతో ఆ బాధ్యతల్ని కేఎల్‌ రాహుల్‌ తీసుకున్నాడు. అప‍్పట్నుంచి రాహులే కీపర్‌ కొనసాగుతూ ఉండటంతో పంత్‌కు ఆడే అవకాశం దక్కడం లేదు. న్యూజిలాండ్‌తో ఇప్పటివరకూ నాలుగు టీ20లు పూర్తయినప్పటికీ పంత్‌కు అవకాశం ఇవ్వలేదు. సంజూ శాంసన్‌ను నాల్గో టీ20లో ఆడించినా అతనొక పేలవమైన షాట్‌కు వెనుదిరిగాడు. మరి ఐదో టీ20లో పంత్‌ను పరీక్షిస్తారా.. లేక సంజూ శాంసన్‌కు మళ్లీ అవకాశం ఇస్తారా అనేది చూడాలి. 

మరిన్ని వార్తలు