సుప్రీం అలా భావిస్తే.. ఆల్‌ ద బెస్ట్‌

2 Jan, 2017 16:29 IST|Sakshi
సుప్రీం అలా భావిస్తే.. ఆల్‌ ద బెస్ట్‌

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాలతో బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి ఉద్వాసనకు గురైన అనురాగ్ ఠాకూర్ స్పందించారు. రిటైర్డ్‌ న్యాయమూర్తుల సారథ్యంలో బీసీసీఐ మెరుగ్గా ఉంటుందని సుప్రీం కోర్టు భావిస్తే సంతోషమని, పగ్గాలు చేపట్టబోయే వారికి అభినందనలంటూ ఠాకూర్‌ వ్యాఖ్యానించారు. లోధా కమిటీ సిఫారుసులను అమలు చేయకపోవడాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు.. బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులు అనురాగ్ ఠాకూర్, అజయ్ షిర్కేలను తొలగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

సుప్రీం కోర్టు ఆదేశాలను తాను గౌరవిస్తున్నానని ఠాకూర్‌ అన్నారు. బీసీసీఐ స్వయం ప్రతిపత్తి కోసం తాము పాటుపడ్డాము కానీ వ్యక్తిగత పోరాటం కాదని వ్యాఖ్యానించారు. అత్యుత్తమ క్రీడా సంఘంగా బీసీసీఐ పేరుపొందిందని, బోర్డు సాయంతో రాష్ట్ర క్రీడా సంఘాలు మెరుగైన క్రికెట్‌ సదుపాయాలు కల్పించిందని చెప్పారు. ప్రపంచ క్రికెట్లో బీసీసీఐకి ప్రత్యేక స్థానముందని అన్నారు. తమ కంటే మాజీ న్యాయమూర్తులు బీసీసీఐని మెరుగ్గా నడిపించగలరని సుప్రీం కోర్టు భావిస్తే తాము స్వాగతిస్తామని చెప్పారు.

>
మరిన్ని వార్తలు