టీమిండియా ఓటమిపై గంగూలీ ధ్వజం

9 Jan, 2018 18:02 IST|Sakshi

కోల్‌కతా: స్వదేశంలో వరుస సిరీస్‌ల్లో గెలిచిన భారత్‌ క్రికెట్‌ జట్టు సత్తా దక్షిణాఫ్రికా పర్యటనలో తేలబోతుందని ముందుగానే వ్యాఖ్యానించిన మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ.. తొలి టెస్టులో ఓటమి తరువాత విరాట్‌ సేన ప్రదర్శనపై విమర్శలు కురిపించాడు. ప్రధానంగా బ్యాటింగ్‌లో టీమిండియా వైఫల్యం చెందడమే ఓటమి కారణమంటూ ధ్వజమెత్తాడు. మ్యాచ్‌లో బౌలర్లు గొప్ప ప్రదర్శన కనబరిచినా.. బ్యాట్స్‌మెన్‌ కనీసం పోరాట పటిమ ఇవ్వలేకపోవడంతోనే ఘోర పరాజయం ఎదురైందన్నాడు.

'పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు కనీసం 300-350 పరుగులు అయినా స్కోర్ చేయాల్సింది. బ్యాట్స్‌మెన్‌ సరైన ప్రదర్శన ఇవ్వలేనప్పుడు పరిస్థితులు క్రమేపీ కఠినంగా మారతాయి. బౌలర్లు రాణించినా.. బ్యాటింగ్‌ వైఫల్యం స్పష్టంగా కనబడింది. ఒకవేళ వచ్చే టెస్టుల్లో భారత మెరవాలంటే కనీసం ప్రతీ ఇన్నింగ్స్‌లో 300కు పైగా స్కోరు తప్పదు' అని హితబోధ చేశాడు. మరొకవైపు ఈ ఓటమితో భారత క్రికెట్‌ బృందం నిరాశకు గురి కావొద్దంటూ సలహా ఇచ్చాడు. వచ్చే మ్యాచ్‌ల్లో ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగడానికి యత్నించాలన్నాడు. తర్వాత మ్యాచ్‌ల్లో విరాట్‌ బ్యాట్‌ నుంచి భారీ స్కోరు వస్తుందని ఆశిస్తున్నట్లు గంగూలీ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు