ధోని టాస్‌ గెలిస్తే ఏం చేస్తాడు: ఐఐటీ మద్రాస్‌

8 May, 2019 18:14 IST|Sakshi

ఐఐటీ మద్రాస్‌ ప్రశ్నాపత్రంలో ధోని గురించి ప్రశ్న

హైదరాబాద్‌: ఐపీఎల్ ఫీవర్ క్రీడల వరకే కాదు.. చదువుల్లోకి కూడా పాకింది. ఐఐటీ మద్రాస్ సోమవారం నిర్వహించిన సెమిస్టర్ పరీక్షల్లో ఐపీఎల్‌కు సంబంధించిన ప్రశ్న అడిగి విద్యార్థులను ఆశ్చర్యపరిచింది. మంగళవారం చెపాక్‌ వేదికగా జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లో ధోనీ టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవాలా? లేదా ఫీల్డింగ్ ఎంచుకోవాలా అనే ప్రశ్నను సంధించింది. మ్యాచ్ జరగడానికి ముందు రోజు నిర్వహించిన మెటీరియల్ అండ్ ఎనర్జీ బ్యాలెన్సెస్ పేపర్లో ఇదే తొలి ప్రశ్న కావడం విశేషం. క్రికెట్ అంటే ఇష్టపడే చాలా మంది విద్యార్థులనే కాదు.. ఐసీసీని కూడా ఈ ప్రశ్న ఆకర్షించింది. ప్రొఫెసర్ విఘ్నేష్ రూపొందించిన ఈ ప్రశ్నను మ్యాచ్ జరగడానికి ముందే ఐసీసీ ట్వీట్ చేసింది. ప్రసుత్తం ఐసీసీ చేసిన ట్వీట్‌ తెగత వైరల్‌ అవుతోంది. 

‘డై అండ్ నైట్ మ్యాచ్‌ల్లో మంచు కీలక పాత్ర పోషిస్తుంది. అవుట్ ఫీల్డ్‌పై మంచు అధికంగా కురవడం వల్ల బంతి తడిగా మారుతుంది. దీంతో బంతిపై పట్టు సాధించడం స్పిన్నర్లకు కష్టం అవుతుంది. ఫాస్ట్ బౌలర్లు కూడా నిర్దేశించిన చోట బంతిని విసరలేరు. దీంతో మంచు ఎక్కువగా ఉండటం రాత్రి పూట ఫీల్డింగ్ చేసే జట్టుకు ప్రతికూలంగా మారుతుంది. ఐపీఎల్ 2019లో చెన్నై సూపర్ కింగ్స్ మే 7న చెపాక్ స్టేడియంలో క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడుతుంది. ఆ రోజున చెన్నైలో గాలిలో తేమ 70 శాతం ఉండొచ్చు. ఆట ప్రారంభంలో ఉష్ణోగ్రత 39 డిగ్రీలు ఉంటుంది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభమయ్యే సమయానికి అది 27 డిగ్రీలకు పడిపోతుంది. ఈ సమాచారం ఆధారంగా ధోనీ టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవాలా? లేదా ఫీల్డింగ్ చేయాలా?’ అనే ప్రశ్నను విద్యార్థులకు సంధించారు. 

ఈ ప్రశ్నను రూపొందించిన ప్రొఫెసర్‌ ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ‘32-33 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరితే మంచు ప్రభావం ఉంటుంది. ముంబైతో మ్యాచ్‌ జరిగే రోజు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభ సమయానికి 27 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది.. దీంతో కచ్చితంగా మంచు కురుస్తుంది. కాబట్టి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడం తెలివైన నిర్ణయం’అంటూ వివరించాడు. అనుకున్నట్టే టాస్ గెలిచిన చెన్నై సారథి ధోని తొలుత బ్యాటింగ్‌ వైపే మొగ్గు చూపాడు. బ్యాట్స్‌మెన్‌ వైపల్యానికి తోడు ముంబై కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో సీఎస్‌కే నాలుగు వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. సీఎస్‌కే నిర్దేశించిన స్వల్పలక్ష్యాన్ని ముంబై ఆడుతూ పాడుతూ ఛేదించడంతో సీఎస్‌కే ఆరు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో ఐఐటీ ప్రొఫెసర్‌లా ధోని ఆలోచించలేకపోయాడంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తూన్నారు.
 

Shout out to Professor Vignesh at @iit_madras for making exams relevant to important, real-life issues! Can anyone help @mahi7781 and @chennaiipl make a decision before the toss tomorrow? (and show your workings 😜) #LoveCricket #Cricket #Madras

A post shared by ICC (@icc) on

మరిన్ని వార్తలు