ఐపీఎల్ వేలం నేడు

6 Feb, 2016 02:02 IST|Sakshi

బెంగళూరు: టి20 ప్రపంచకప్‌కు భారత జట్టును ఎంపిక చేసిన మరుసటి రోజే ధనాధన్ క్రికెట్‌కు సంబంధించి మరో కీలక ఘట్టానికి తెర లేస్తోంది. ఐపీఎల్-9 కోసం 116 మంది ఆటగాళ్లను ఎంచుకునేందుకు నేడు (శనివారం) వేలం జరగనుంది. కొత్తగా వచ్చిన పుణే జెయింట్స్, గుజరాత్ లయన్స్ సహా ఎనిమిది జట్లు ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు సన్నద్ధమయ్యాయి. ఎనిమిది మంది క్రికెటర్లు తమ కనీస ధరను రూ. 2 కోట్లుగా నిర్ణయించుకోగా, అతి తక్కువగా రూ. 10 లక్షల బేస్ ప్రైస్‌తో దేశవాళీ కుర్రాళ్లు కూడా అందుబాటులో ఉన్నారు.

ఒక్కరోజులోనే వేలం ముగుస్తుంది. వేలంలో భారత ఆటగాళ్లు యువరాజ్ సింగ్, ఇషాంత్, నెహ్రాలకు మంచి డిమాండ్ ఉంది. భారీ హిట్టర్లుగా పేరున్న విదేశీ ఆటగాళ్లు వాట్సన్, పీటర్సన్, ఫించ్, గప్టిల్, డ్వేన్ స్మిత్ భారీ మొత్తం ఆశిస్తున్నారు. దిల్షాన్, మిషెల్ మార్ష్, స్యామీ, ఇర్ఫాన్ పఠాన్, తిసార పెరీరా, ముస్తఫిజుర్‌లను తీసుకునేందుకు జట్లు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఎక్కువ సంఖ్యలో ఆటగాళ్లను విడుదల చేయడం వల్ల అన్ని జట్ల వద్ద పెద్ద మొత్తం అందుబాటులో ఉండటంతో ఈ సారి కూడా క్రికెటర్ల పంట పండవచ్చు!
 
అంచనాలు...అవకాశాలు...
ఢిల్లీ డేర్‌డెవిల్స్: ప్రస్తుతం జట్టులో 13 మంది మాత్రమే ఉన్నారు. మరో 14 మంది వరకు కొనుక్కునే అవకాశం ఉంది.
 
గుజరాత్ లయన్స్: పూర్తి స్థాయి జట్టును రూపొందించాల్సి ఉంది. ఒక అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్, ఒక టాప్ బౌలర్ కోసం చూస్తున్నారు.
 
కింగ్స్ ఎలెవన్ పంజాబ్: టాప్ బౌలర్ అవసరం ఉండటంతో స్టెయిన్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. జట్టుకు కెప్టెన్ కూడా కావాలి.
 
కోల్‌కతా నైట్‌రైడర్స్: స్టార్ ఆల్‌రౌండర్ కావాలి. వాట్సన్‌పై దృష్టి పెట్టారు. ఇది మినహా ఈ జట్టు దూసుకెళ్లే ఆటగాళ్లను తీసుకునేందుకు ఆసక్తిగా లేదు.
 
ముంబై ఇండియన్స్: తరచుగా గాయపడే మలింగకు ప్రత్యామ్నాయంగా ఒక పేసర్ అవసరం.
 
పుణే సూపర్ జెయింట్స్: ప్రస్తుతం ఉన్న ఐదుగురు కాకుండా పూర్తిగా కొత్త జట్టును రూపొందించుకోవాలి. ధోని వ్యూహాల ప్రకారం ఆల్‌రౌండర్లపై దృష్టి పెట్టవచ్చు.
 
బెంగళూరు: ఆర్‌సీబీ వద్ద అంతా స్టార్లే ఉన్నారు. గత అనుభవాల నేపథ్యంలో ఈ సారి ఉదారంగా ఖర్చు పెట్టకపోవచ్చు.
 
సన్‌రైజర్స్ హైదరాబాద్: హిట్టింగ్ చేయగల భారత ఆటగాళ్లపై దృష్టి. పీటర్సన్‌పై కూడా ఆసక్తి చూపొచ్చు.

whatsapp channel

మరిన్ని వార్తలు