ఇమాముల్‌ ఆటపై ఐస్‌లాండ్‌ క్రికెట్‌ ట్రోలింగ్‌

1 Dec, 2019 16:15 IST|Sakshi

అడిలైడ్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే అండ్‌ నైట్‌ టెస్టులో ఘోరంగా విఫలమైన పాకిస్తాన్‌ ఓపెనర్‌ ఇమాముల్‌ హక్‌ను ఐస్‌లాండ్‌ క్రికెట్‌ దారుణంగా ఆడేసుకుంది. ఈ మ్యాచ్‌తో ఐస్‌లాండ్‌ క్రికెట్‌కు ఏమాత్రం సంబంధం లేకపోయినా ఇమాముల్‌ ఒక ప్లేయర్‌ కాదు అనేంతగా ట్వీటర్‌ అకౌంట్‌లో విమర్శలు చేసింది. ఆసీస్‌తో రెండో టెస్టులో ఆడుతున్న ఇమాముల్‌ హక్‌ తొలి ఇన్నింగ్స్‌లో రెండు పరుగులు చేస్తే, రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌ అయ్యాడు.

ఇక ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ రెండు టెస్టులకు గాను రెండు ఇన్నింగ్స్‌లు ఆడి 489 పరుగులు చేశాడు. అందులో 154 పరుగుల్ని బ్రిస్బేన్‌లో జరిగిన మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సాధిస్తే, ఇక రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అజేయంగా 335 పరుగులు చేశాడు.  దీన్ని టార్గెట్‌ చేస్తూ.. వార్నర్‌ రెండు ఇన్నింగ్స్‌లో చేసిన పరుగుల కంటే ఇమాముల్‌ హక్‌ తన కెరీర్‌లో సాధించిన పరుగులే తక్కువంటా ఎద్దేవా చేసింది. ఇప్పటివరకూ ఇమాముల్‌ హక్‌ 11 టెస్టు మ్యాచ్‌లకు గాను 21 ఇన్నింగ్స్‌లు ఆడి 485 పరుగులు చేశాడు.

ఇక పాకిస్తాన్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. ఇమాముల్‌ హక్‌ డకౌట్‌గా వెనుదిరిగితే, అజహర్‌ అలీ 9 పరుగులు చేసి నిరాశపరిచాడు. బాబర్‌ అజామ్‌ కూడా 8 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. పాకిస్తాన్‌ 16.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 39 పరుగుల వద్ద ఉండగా వర్షం పడటంతో మ్యాచ్‌ నిలిపివేశారు.

మరిన్ని వార్తలు