అమ్మో జడేజాతో చాలా కష్టం: కోహ్లి

25 Nov, 2019 15:44 IST|Sakshi

కోల్‌కతా:  వరల్డ్‌ క్రికెట్‌లో రవీంద్ర జడేజా అత్యుత్తమ ఫీల్డర్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదు. మెరుపు ఫీల్డింగ్‌తో అద్భుతమైన క్యాచ్‌లను అందుకోవడంలో కానీ వేగవంతమైన ఫీల్డింగ్‌తో ప్రత్యర్థి జట్లు చేసే పరుగుల్ని నియంత్రించడంలో కానీ జడేజా ముందు వరుసలో ఉంటాడు. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌తో పాటు మంచి ఫీల్డర్‌ కూడా కావడంతోనే  భారత జట్టులో జడేజా ప్రత్యేక స్థానం సంపాదించాడనేది కాదనలేని వాస్తవం.

అదే విషయాన్ని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరోసారి చెప్పుకొచ్చాడు. అథ్లెటిక్స్‌ స్కిల్స్‌లో జడేజా ప్రతిభ అమోఘం అంటూ కొనియాడాడు. ఇందుకు ట్రైనింగ్‌ సెషన్స్‌లో జడేజా-పంత్‌లతో  కలిసి పరుగు పెట్టిన ఒక ఫోటోను కోహ్లి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. జడేజాతో కలిసి పరుగు పెట్టాలన్నా, అతన్ని అధిగమించాలన్నా అసాధ్యమంటూ కోహ్లి తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. కొన్ని గ్రూప్‌లుగా ఏర్పడి భారత ఆటగాళ్లు ట్రైనింగ్‌ సెషన్స్‌ పాల్గొన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలిపాడు. ఇలా సభ్యులుగా ఏర్పడి ట్రైనింగ్‌ సెషన్స్‌లో పాల్గొనడానికి తాను ఎక్కువగా ఆస్వాదిస్తానని కోహ్లి అన్నాడు. ‘ గ్రూప్‌ కండీషనింగ్‌ సెషన్స్‌ను నేను ఎక్కువగా ప్రేమిస్తా. కాకపోతే జడేజా గ్రూప్‌లో ఉన్న ట్రైనింగ్‌ సెషన్స్‌లో అతన్ని దాటుకు వెళ్లడం దాదాపు అసాధ్యం’ అని కోహ్లి తెలిపాడు.

మరిన్ని వార్తలు