భారత్‌పై పాక్‌ విజయం.. మేము ఏ జట్టునీ పంపలేదు!

18 Feb, 2020 12:07 IST|Sakshi

లాహోర్‌: ‘కబడ్డి ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ను ఓడించి, కప్పు గెలిచిన పాకిస్తాన్ జట్టుకు శుభాకాంక్షలు’.. ఈ మాటలు అన్నది పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. అయితే సర్కిల్‌ కబడ్డి ప్రపంచకప్ ఆడటానికి భారత్ నుంచి అధికారికంగా ఏ జట్టూ వెళ్లలేదట. కానీ ఆదివారం రాత్రి ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై 43-41 తేడాతో పాక్ గెలిచిందట. ఈ విషయం తెలిసిన పాక్ ప్రధాని తమ జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.  పాకిస్తాన్ వేదికగా తొలిసారి సర్కిల్ కబడ్డి వరల్డ్‌కప్ నిర్వహించారు.

అయితే  పాక్‌లో నిర్వహిస్తున్న సర్కిల్ కబడ్డి వరల్డ్‌కప్‌లో పాల్గొనడానికి తాము ఎటువంటి జట్టును పంపలేదని, ఎవరైనా వచ్చినా వారు భారత్ పేరు వాడటానికి అనుమతి లేదని పేర్కొంటూ అమెచ్యూర్ కబడ్డి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఏకేఎఫ్‌ఐ).. పాక్ కబడ్డీ బోర్డుకు అంతకుముందే లేఖ రాసిందట. అలాగే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) కూడా పాక్‌లో జరుగుతున్న ఈ టోర్నీకి ఎటువంటి జట్టునూ పంపడంలేదని గత సోమవారమే స్పష్టంచేసింది. కొందరు భారతీయ కబడ్డీ క్రీడాకారులు అనుమతి లేకుండా పాకిస్తాన్ వెళ్లారని, వారే ఈ టోర్నీలో పాల్గొన్నారని కొందరు వాదిస్తున్నారు. మనదేశంలోని పంజాబ్‌లో ఈ సర్కిల్ కబడ్డి ఎక్కువగా ఆడతారు. ఆ జట్టే భారత ప్రభుత్వం అనుమతి లేకుండా పాకిస్తాన్‌కు వెళ్లి టోర్నీలో భాగస్వామ్యమైనట్లు తెలుస్తోంది. 

>
మరిన్ని వార్తలు