'భారత్ కు ముందు బ్యాటింగ్ ఇవ్వకండి'

17 Jun, 2017 16:20 IST|Sakshi
'భారత్ కు ముందు బ్యాటింగ్ ఇవ్వకండి'

కరాచీ:చాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్తాన్ జట్లు ఫైనల్ కు చేరిన క్రమంలో తమ తమ వ్యూహాలకు పదునుపెట్టే పనిలో పడ్డాయి. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన భారత్ జట్టు తిరిగి టైటిల్ ను నిలబెట్టుకోవాలని భావిస్తుండగా, మరొకవైపు తొలిసారి చాంపియన్స్ ట్రోఫీని చేజిక్కించుకోవాలని పాకిస్తాన్ యోచిస్తోంది.

ఇరు జట్ల బలాబలాను పరిశీలిస్తే భారత్ అన్ని రంగాల్లోనూ పాక్ కంటే మెరుగ్గా ఉంది. ప్రధానంగా బ్యాటింగ్ లో విరాట్ సేన మంచి పటిష్టంగా కనిపిస్తోంది. ఇదే విషయాన్నిపాక్ దిగ్గజ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావిస్తూ.. ఎట్టిపరిస్థితుల్లోనూ భారత్ కు ముందుగా బ్యాటింగ్ ఇవ్వొద్దని తమ దేశ క్రికెటర్లకు సూచించాడు.

'పాకిస్తాన్ టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ తీసుకోండి. టాస్ గెలిచి భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించవద్దు. ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉండాలంటే ముందుగా బ్యాటింగ్ చేయడమే పాకిస్తాన్ కు సరైన మార్గం. బ్యాటింగ్ తీసుకుని మంచి స్కోరును బోర్డుపై ఉంచండి. అప్పుడు మన బౌలింగ్ తో భారత్ ను కట్టడి చేసే అవకాశం ఉంటుంది. ఈ టోర్నమెంట్ లో మన బలం బౌలింగే అనేది గుర్తుంచుకోండి. భారత్ పై లక్ష్యాన్ని ఛేదించే సాహసాన్ని చేయకండి'అని కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ను ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించాడు. ఆదివారం జరిగే టైటిల్ పోరు కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. గ్రూప్ స్టేజ్ లో ఫలితాన్ని భారత్ పునరావృతం చేస్తుందా?లేక పాకిస్తాన్ పైచేయి సాధిస్తుందా అనేది చూడాల్సిందే.

మరిన్ని వార్తలు