ఏపీలో ఎన్నికలు జరిగేనా!

17 Sep, 2013 23:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్:  దాదాపు దశాబ్ద కాలంగా ఆంధ్రప్రదేశ్‌లో ఫుట్‌బాల్ క్రీడ తెరమరుగైంది. రెండు సంఘాల మధ్య రాజకీయాలు, కోర్టు కేసులతో ఏపీ ఫుట్‌బాల్ సంఘం (ఏపీఎఫ్‌ఏ) ఉనికిని కోల్పోయింది. అసోసియేషన్ పని చేయక, టోర్నీల నిర్వహణ లేక యువ ఆటగాళ్లంతా ఫుట్‌బాల్‌కు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితి చక్కబెట్టేందుకు భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. తాజాగా మరో సారి ఏఐఎఫ్‌ఎఫ్ అనిశ్చితికి తెర దించేందుకు ప్రయత్నిస్తోంది. ఏపీ ఫుట్‌బాల్ సంఘానికి వచ్చే నెల 6న ఎన్నికలు జరపాలని నిర్ణయించింది. ఇందు కోసం ముగ్గురు సభ్యుల కమిటీని ప్రత్యేకంగా నియమించింది. ‘శాప్’ డిప్యూటీ డెరైక్టర్ సీహెచ్ రమేశ్, ఏపీ ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు కె.రంగారావు, ఏఐఎఫ్‌ఎఫ్ తరఫున గులాం రబ్బానీ ఇందులో సభ్యులుగా ఉన్నారు. కమిటీ విజ్ఞప్తిపై హైకోర్టు రిటైర్జ్ జడ్జి జస్టిస్ టీసీహెచ్ సూర్యారావు ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు.
 
 తొమ్మిది పదవుల కోసం...
 మొత్తం తొమ్మిది పదవుల కోసం నోటిఫికేషన్ వెలువడింది. అధ్యక్షుడు, ముగ్గురు ఉపాధ్యక్షులు, కార్యదర్శి కం కోశాధికారి, ముగ్గురు సంయుక్త కార్యదర్శులు, సహాయక కార్యదర్శి పదవుల కోసం ఎన్నికలు జరుగుతాయి. ఈ నెల 23 నుంచి 25 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 30లోగా ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. ఏపీ ఒలింపిక్ భవన్‌లో అక్టోబర్ 6న ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు.
 
 సమన్వయం సాధ్యమా...
 ఏపీలో ఎన్నికలు నిర్వహించాలని ఏఐఎఫ్‌ఎఫ్ చేస్తున్న ప్రయత్నం మంచిదే. అయితే ఇది కూడా గతంలో ఫుట్‌బాల్ సంఘంలో పని చేసిన కొంత మంది వ్యక్తుల ఒత్తిడిపైనే జరుగుతున్నట్లు సమాచారం. వాస్తవానికి సమాఖ్య నోటిఫికేషన్ అయితే ఇచ్చింది కానీ నిబంధనల ప్రకారం ఏపీ ఫుట్‌బాల్ సంఘం నియమావళిని అనుసరించే ఎన్నికలు జరగాలి. దీని ప్రకారం ఇప్పుడు ఓటర్లను గుర్తించడమే సమస్య.
 
 నిబంధనల ప్రకారం ఒక జిల్లాలో కనీసం ఆరు క్లబ్‌లు చురుగ్గా పని చేస్తూ, టోర్నీలు నిర్వహిస్తుంటేనే అక్కడి అధ్యక్షుడు, కార్యదర్శికి ఓటు హక్కు ఉంటుంది. పైగా ఏపీ సంఘంలో వివాదం అనంతరం దాదాపుగా ప్రతీ జిల్లాలోనూ రెండు వర్గాలు తయారయ్యాయి. వీరిలో ఎవరికి అవకాశం కల్పిస్తారు, ఎవరికి ఓటు హక్కు ఇస్తారో తెలీకుండా ఎన్నికలు నిర్వహించడం అసాధ్యం. ఈ నేపథ్యంలో ఏఐఎఫ్‌ఎఫ్ ప్రయత్నం సఫలమవుతుందో లేదో చూడాలి.
 

మరిన్ని వార్తలు