ఆస్పత్రిలో10 మంది క్రికెటర్లు

10 Aug, 2015 09:53 IST|Sakshi
ఆస్పత్రిలో10 మంది క్రికెటర్లు

దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుకు అనారోగ్యం

చెన్నై: పాపం దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుకు ఎంత కష్టం వచ్చింది! ఒకరు కాదు ఇద్దరు కాదు...ఏకంగా పది మంది సభ్యులు ఒక్కసారే అనారోగ్యం బారిన పడ్డారు. చెన్నైలో వాతావరణం ఒక కారణం కాగా, ముందు రోజు రాత్రి తీసుకున్న భోజనం పడక చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం 10 మంది ఆటగాళ్లు స్థానిక అపోలో ఆస్పత్రిలో ఉన్నారని దక్షిణాఫ్రికా బోర్డు అధికారిక ప్రకటన చేసింది. భారత్‌తో వన్డేలో సెంచరీ చేసి 25 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేసిన డి కాక్ కూడా ఒక్కసారిగా ఆరోగ్యం దెబ్బ తినడంతో హాస్పిటల్ చేరాడు.

అంతకు ముందు స్వల్ప అనారోగ్యంతో మ్యాచ్ నుంచి దూరంగా ఉన్న ముగ్గురు క్రికెటర్లు తప్పనిసరి పరిస్థితిలో ఎవరూ అందుబాటులో లేక మైదానంలో దిగాల్సి వచ్చింది. ఈ కారణంగా తాము షెడ్యూల్ ప్రకారం సోమవారం ఆసీస్‌తో మ్యాచ్ ఆడలేమని వారు విజ్ఞప్తి చేయడంతో...ఆసీస్‌తో భారత్ బరిలోకి దిగేందుకు కోచ్ ద్రవిడ్ అంగీకరించారు. చివరకు ఆటగాళ్లు సరిపోక భారత్‌తో మ్యాచ్‌లో భారత ఆటగాడు మన్‌దీప్ సింగ్ సౌతాఫ్రికా జెర్సీతో ఫీల్డింగ్ చేయడం విశేషం!

మరిన్ని వార్తలు