ఒక్క రోజులో లక్ష్యం చేరలేరు

29 Aug, 2013 01:46 IST|Sakshi
ఒక్క రోజులో లక్ష్యం చేరలేరు

ధ్యాన్‌చంద్ జయంతిని క్రీడా దినోత్సవంగా నిర్వహించడం ఒక హాకీ క్రీడాకారుడిగా నాకు గర్వకారణం. ఆ గొప్ప మనిషి వల్లే మాకు ఈ మాత్రం గుర్తింపు దక్కిందనడంలో సందేహం లేదు. ధ్యాన్‌చంద్ అద్భుతాల గురించి చెప్పే స్థాయి నాకు లేదు. కానీ ఆయన ఆట, మ్యాజిక్ కారణంగానే ప్రపంచ క్రీడా రంగానికి భారత్ అంటే ఏమిటో, హాకీ అంటే ఏమిటో తెలిసింది. నేను హాకీని ఎంచుకున్నప్పుడు దేశానికి ఆడతానని ఊహించలేదు.
 
 అలాంటి లక్ష్యాన్ని కూడా పెట్టుకోలేదు. అయితే ఏదో ఒక ఆట ఆడితే రైల్వేలోనే, బ్యాంకులోనో ఉద్యోగం దక్కుతుందనే ఆలోచన అప్పట్లో అందరికీ ఉండేది. మా ఇంటి వద్ద ఎక్కువ మంది హాకీ ఆటగాళ్లు ఉండేవారు. దాంతో సహజంగానే నాకు కూడా ఆటపై ఆసక్తి పెరిగింది. అయితే ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్నా... హాకీపై ప్రేమ పెంచుకున్నాను. పట్టుదలగా ఆడి నా ఆటను మెరుగు పర్చుకున్నాను. ఫలితంగా అవకాశాలు వాటంతట అవే వచ్చాయి. కొన్ని సార్లు ఇబ్బంది ఎదుర్కొన్నా కుంగిపోలేదు. కాబట్టే భారత్‌కు చాలాకాలం ఆడగలిగాను.
 
 దురదృష్టవశాత్తూ ప్రస్తుతం ఆటల్లో రాజకీయాలు బాగా పెరిగాయి. ఇక ఉద్యోగావకాశాలు కూడా అంతంత మాత్రంగానే ఉండి ఆటగాళ్లను వెనక్కి లాగుతున్నాయి. అయితే కుర్రాళ్లు స్థైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. ప్రతిభ ఉన్నవాడికి ఏదీ అడ్డు కాదు. హాకీ స్టిక్ అంటే వెనకడుగు వేయాల్సిన పని లేదు. సత్తా ఉంటే ప్రోత్సహించేందుకు మాజీ ఆటగాడిగా నేను కూడా అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాను. అందుకోసం ప్రత్యేక ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నాం. అయితే ఒక్క రోజులో స్టార్‌గా మారిపోయి గుర్తింపు తెచ్చుకోవాలంటే మాత్రం అసాధ్యం. ముందు ఆటను అభిమానించండి. నిరంతర శ్రమ, పట్టుదల ఉంటే అవకాశాలు దాని వెంటే వస్తాయి.

మరిన్ని వార్తలు