సెమీస్‌లో హైదరాబాద్ ఎలెవన్

5 Sep, 2013 00:11 IST|Sakshi
సెమీస్‌లో హైదరాబాద్ ఎలెవన్

సాక్షి, హైదరాబాద్: ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్ కప్‌లో హైదరాబాద్ ఎలెవన్ జట్టు సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం ఉప్పల్ స్టేడియంలో ముగిసిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఎలెవన్ 7 వికెట్ల తేడాతో కేరళను చిత్తు చేసింది. మ్యాచ్ మూడో రోజు కేరళ తమ రెండో ఇన్నింగ్స్‌లో 36.2 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. జాఫర్ జమాల్ (49), అక్షయ్ కొడాత్ (38), సచిన్ మోహన్ (30) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో సీవీ మిలింద్ 52 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, ప్రజ్ఞాన్ ఓజా 83 పరుగులకు 3 వికెట్లు తీశాడు. అనంతరం 155 పరుగుల విజయలక్ష్యాన్ని హైదరాబాద్ 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. తిరుమలశెట్టి సుమన్ (59 బంతుల్లో 56; 10 ఫోర్లు), డెరిక్ ప్రిన్స్ (77 బంతుల్లో 56 నాటౌట్; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలతో పాటు సందీప్ (31 నాటౌట్) రాణించడంతో హైదరాబాద్ 34.3 ఓవర్లలో 3 వికెట్లకు 157 పరుగులు చేసింది.
 
 
 కర్ణాటక విజయం...
 టోర్నీలో హెచ్‌సీఏ తరఫున బరిలోకి దిగిన రెండో జట్టు హైదరాబాద్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ పరాజయంపాలైంది. ఈసీఐఎల్‌లో ముగిసిన ఈ మ్యాచ్‌లో కర్ణాటక 6 వికెట్ల తేడాతో ప్రెసిడెంట్స్ ఎలెవన్‌ను చిత్తు చేసింది. రెండో ఇన్నింగ్స్ హెచ్‌సీఏ ప్రెసిడెంట్స్ ఎలెవన్ నిర్ణీత 40 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. అహ్మద్ ఖాద్రీ (87 బంతుల్లో 79; 1 ఫోర్, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, అభినవ్ కుమార్ (41), సందీప్ రాజన్ (32) రాణించారు. అరవింద్ 3, అక్షయ్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం కర్ణాటక 38.2 ఓవర్లలో 4 వికెట్లకు 224 పరుగులు చేసి విజయాన్నందుకుంది. మయాంక్ అగర్వాల్ (70 బంతుల్లో 98; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), కరుణ్ నాయర్ (105 బంతుల్లో 81; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగి కర్ణాటకను గెలిపించారు.
 
 ఢిల్లీని గెలిపించిన మనన్ శర్మ...
 మనన్ శర్మ (5/57) చెలరేగడంతో ఎన్‌ఎఫ్‌సీలో జరిగిన మరో మ్యాచ్‌లో ఢిల్లీ 9 వికెట్ల తేడాతో గోవాపై ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో గోవా నిర్ణీత 40 ఓవర్లలో 7 వికెట్లకు 243 పరుగులు చేసింది. స్నేహాల్ (92 బంతుల్లో 81; 4 ఫోర్లు), అమోఘ్ దేశాయ్ (54 బంతుల్లో 57; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం ఢిల్లీ 29 ఓవర్లలో వికెట్ నష్టానికి 120 పరుగులు చేసి సెమీస్ చేరుకుంది. జాగృత్ ఆనంద్ (77 బంతుల్లో 66 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేశాడు.
 

మరిన్ని వార్తలు