కొత్త ఉత్సాహంతో ఉన్నాం...

6 May, 2016 00:48 IST|Sakshi
కొత్త ఉత్సాహంతో ఉన్నాం...

విశ్రాంతి అనంతరం
నేడు బరిలోకి సన్‌రైజర్స్

 
సాక్షి, హైదరాబాద్: దాదాపు వారం రోజుల క్రితం బెంగళూరుపై కీలక విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. ఆ తర్వాత దక్కిన ఐదు రోజుల విరామాన్ని ఆటగాళ్లు పూర్తిగా ఉపయోగించుకున్నారు. ఈ విరామంలో ఆటగాళ్లు తమకు నచ్చిన రీతిలో సరదాగా గడిపారు. ఇప్పటికి సరిగ్గా సగం మ్యాచ్‌లు ఆడిన జట్టు, రెండో దశకు సిద్ధమైంది. కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగి ప్లే ఆఫ్ దిశగా దూసుకుపోవాలని జట్టు పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో రైజర్స్ ప్రధాన ఆటగాళ్లు వార్నర్, ధావన్, భువనేశ్వర్ గురువారం మీడియాతో ముచ్చటించారు. ఆటతో పాటు తమ ఆసక్తులను పంచుకున్నారు. విశేషాలు వారి మాటల్లోనే...
 
 నాకు నచ్చిందే చేస్తా!

ఐపీఎల్ ఆరంభంలో కాస్త తడబడ్డాను. కానీ కొద్ది సేపు నిలదొక్కుకోగలిగితే రాణిస్తానని నాకు నమ్మకముంది. ఇప్పుడు మళ్లీ లయ అందుకున్నాను. కెప్టెన్‌గా, ఓపెనింగ్ సహచరుడిగా కూడా వార్నర్ ఎంతో అండగా నిలిచాడు. క్రీజ్‌లో ఉన్నప్పుడు నాపై ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేశాడు. రెండేళ్లుగా కలిసి ఆడటంతో అతనితో మంచి సమన్వయం ఉంది. టి20ల్లో టాపార్డర్ బాగా ఆడితే విజయం దక్కుతుంది. రైజర్స్‌కు ఇప్పుడు మంచి అవకాశాలు ఉన్నాయి. అనుభవజ్ఞులు యువరాజ్, నెహ్రాల రాకతో జట్టు బలం పెరిగింది. మా ఫీల్డింగ్ కాస్త మెరుగైతే చాలు.

పాతతరం ఆటగాళ్లకు ఎలా ఉండేదో తెలీదు కానీ సోషల్ మీడియా వల్ల మా జనరేషన్ క్రికెటర్లపై బాగా ఒత్తిడి పెరిగింది. ప్రతీ విషయం అందరికీ చేరిపోతోంది. నాకు నచ్చింది నేను చేస్తాను తప్ప ఎవరి కోసమో, స్టైల్ ఐకాన్‌గా గుర్తింపు తెచ్చుకునేందుకో కాదు. మీసం మెలేసినా, పఠానీ సూట్ ధరించినా, చెవిపోగు అయినా అదంతా నేను ఇష్టంతో చేసే పని. వీటి వల్ల నాలో కొత్త ఉత్సాహం వచ్చినట్లు కనిపిస్తుంది. ఇక నేను ఎవరికో చూపించడానికో, సరదాకో స్విచ్ హిట్‌లు, స్కూప్‌లులాంటి షాట్లు ఆడను. సాధారణ షాట్లతోనే పరుగులు వస్తుంటే ఇంక వాటి అవసరం లేదు’ - ధావన్
 
మందు మానేశా... అంతా బాగుంది!
మనం ఏదైతే బాగా ఇష్టపడతామో దానిని వదిలేయడం అంత సులువు కాదు. గతంలో మ్యాచ్‌కు ముందు గానీ, మ్యాచ్ తర్వాత గానీ తప్పనిసరిగా మద్యం తీసుకునేవాడిని. దీనివల్ల నా మనసు ప్రశాంతంగా అనిపించేది. మానేశాక అంతా భిన్నంగా ఉంది. ఇప్పుడు నా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. గత 12 నెలల కాలంలో ఆస్ట్రేలియా తరఫున, ఐపీఎల్‌లో చాలా క్రికెట్ ఆడటమే కాదు బాగా ఆడుతున్నాను కూడా. ప్రతీ అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నా.

మందు మానేయడం వల్ల గాయాలయ్యే అవకాశాలు కూడా తక్కువ. దీని వల్ల నా అత్యుత్తమ ఆటను ప్రదర్శించగలుగుతున్నా. అల్కహాల్‌కు గుడ్‌బై చెప్పి నాకు నేనే సవాల్ విసిరా. లక్ష్యం చేరుకోవడం సంతోషంగా ఉంది. నేను కెప్టెన్‌గా మరీ కొత్త వ్యూహాలు ఏమీ అమలు చేయడం లేదు. పైగా ప్రతీది చెప్పాల్సిన అవసరం లేకుండా ఆటగాళ్లంతా బాగా ఆడుతుండటంతో నా పని మరింత సులువైంది. జట్టులో 11 మందీ సమానమే. ఎవరినీ గొప్ప చేసి చెప్పను. యువరాజ్ ఇప్పుడు పూర్తి ఫిట్‌గా ఉన్నాడు’   - వార్నర్
 
స్పీడున్నా ‘స్వింగ్’ మారదు
ఐపీఎల్ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో విఫలమైన తర్వాత నా బౌలింగ్‌పై కాస్త ఆందోళన కలిగింది. అయితే ఆ తర్వాత మరింత ప్రాక్టీస్‌తో నియంత్రణ సాధించాను. నేను ప్రధానంగా స్వింగ్ బౌలర్‌నే. కానీ వేగంగా వేసేందుకు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాను. బౌలింగ్‌లో వేగం పెరిగితే స్వింగ్ పోతుందని చాలా మంది అంటారు. కానీ నేను రెండింటినీ సమన్వయం చేసుకోగలననే నమ్మకముంది. దాని కోసం ప్రాక్టీస్ సెషన్‌లోనే ఎక్కువగా సాధన చేస్తున్నాను. తొలి ఆరు ఓవర్లలో, చివరి ఓవర్లలో నా బౌలింగ్‌లో కచ్చితంగా వైవిధ్యం ఉంటుంది. టి20 ఫార్మాట్‌లో బౌలర్ మరింత తెలివిగా వ్యవహరించాలి. యార్కర్లు, స్లో బౌన్సర్లు సమర్థంగా ఉపయోగించాలి.

మా జట్టులో మంచి పేసర్లు ఉండటంతో ఒకరినుంచి మరొకరు నేర్చుకునే అవకాశం లభిస్తోంది. ముస్తఫిజుర్ గొప్పతనం అతని యాక్షన్‌లో ఉంది. అది అతనికి సహజంగా వచ్చింది. ఐపీఎల్‌లాంటి బిజీ షెడ్యూల్‌లో సుదీర్ఘ విశ్రాంతి లభించడం చాలా మంచి విషయం. కొత్తగా ఆలోచించేందుకు, బాగా ఆడేందుకు కావాల్సిన ఉత్సాహాన్ని ఇది ఇస్తుంది. రాబోయే మ్యాచ్‌లలో మరింతగా రాణిస్తాను’ - భువనేశ్వర్
 

మరిన్ని వార్తలు