జ్వాల ఆనందం

3 May, 2016 14:44 IST|Sakshi
జ్వాల ఆనందం

ఆనందం, సంతోషం.. బాధ, దుఖం.. దేన్నీ దాచుకోకుండా కుండబద్దలు కొట్టినట్లు వ్యవహరించే స్టార్ షట్లర్ గుత్తా జ్వాల మరోసారి అదేపని చేశారు. రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన ఆనందంలో వీపుపై ఉన్న ఒలింపిక్ టాటూ కనిపించే ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు గుత్తా జ్వాల. అన్ని విధాల ప్రోత్సహించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. 'మనం సాధించాం..' అంటూ తన జోడి అశ్విని పొన్నప్పకు అభినందనలు తెలిపారు. డబుల్స్ విభాగంలో గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పలతోపాటు మొత్తం ఏడుగురు షట్లర్ల ఒలింపిక్ బెర్త్ లు మంగళవారం ఖరారయ్యాయి. వారిలో సైనా నెహ్వాల్, పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, మను ఆత్రి, సుమీత్ రెడ్డిలు ఉన్నారు. ర్యాంకుల ఆధారంగా వీరిని ఎంపిక చేశారు.

క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ గా భావించిన ఏసియన్ బ్యాడ్మింటర్ చాపియన్ షిప్ పోటీలు ముగిసిన తర్వాత ర్యాంకులను బట్టి షట్లర్లను ఎంపిక చేశారు. ర్యాంకులు మే 5న అధికారికంగా ప్రకటిస్తారు. ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్ లో డబుల్స్ విభాగంలో జ్వాలా, అశ్వినిలు భారత్ కు ప్రాతినిథ్యం వహిస్తారు. సింగిల్స్ విభాగంలో ఈసారి ఇద్దరు క్రీడాకారిణులు(సైనా, సింధు) బరిలోకి దిగనున్నారు. పురుషుల సింగిల్స్ లోనూ ఈసారి ఇద్దరిని పంపే అవకాశం లభించింది. అయితే పారుపల్లి కాశ్యప్ అనూహ్యరీతిలో గాయపడటం, శస్త్రచికిత్స చేయుంచుకోవడంతో ఇండియా ఆ అవకాశాన్ని కోల్పోక తప్పలేదు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బిడబ్ల్యూఎఫ్) నిబంధనల మేరకు 16వ ర్యాంకులోపు ర్యాకుల్లో ఉన్న క్రీడాకారుల్లో ఇద్దరిని ఒలింపిక్స్ కు పంపొచ్చు. శ్రీకాంత్, కాశ్యప్ లు ఇద్దరూ ప్రస్తుతం 16 కంటే తక్కువ ర్యాంకులోనే కొనసాగుతున్నారు. ఆగస్ట్ 5 నుంచి 21 రియో డి జెనిరో ఒలింపిక్స్ జరుగుతాయి.

టాటూ వెనుక కథ..
గుత్తా జ్వాల ఎన్నటికీ మర్చిపోలేని పోటీలు.. 2012 లండన్ ఒలింపిక్స్. ఆ వేదికపై బ్యాడ్మింటర్ చరిత్రలోనే కొత్త అధ్యాయం సృష్టించింది జ్వాల. డబుల్స్, మిక్స్ డ్ డబుల్స్  రెండు విభాగాల్లోనూ ఒలింపిక్ బెర్త్ పొందిన మొదటి షట్లర్ ఆమె. అందుకే 2012 ఒలింపిక్ గుర్తును వీపుపై పచ్చబొట్టు పొడిపించుకుంది.

మరిన్ని వార్తలు