ఆ విమర్శలపై అయ్యర్‌ ఆగ్రహం

16 Jan, 2020 19:58 IST|Sakshi

రాజ్‌కోట్‌ : ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఘోర ఓటమి తర్వాత టీమిండియాపై అన్ని వైపులా విమర్శల దాడులు పెరిగిపోయాయి. గెలిచినన్ని రోజులు కోహ్లి సేన భజన చేసిన పలువురు మాజీ క్రికెటర్లు సైతం ఒక్క మ్యాచ్‌ ఓడిపోవడంతో టీమిండియాను కడిగిపారేస్తున్నారు. ప్రధానంగా బ్యాటింగ్‌ ఆర్డర్‌ మార్పుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాటింగ్‌ ఆర్డర్‌ మార్పుల కారణంగానే ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయామని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. అయితే రాజ్‌కోట్‌ వేదికగా కీలక రెండో మ్యాచ్‌ సందర్భంగా యువ క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ మీడియా సమావేశంలో మాట్లాడాడు. ముఖ్యంగా బ్యాటింగ్‌ ఆర్డర్‌పై వస్తున్న విమర్శలను అయ్యర్‌ తిప్పికొట్టాడు.   

‘నేను కచ్చితంగా అదే స్థానంలో బ్యాటింగ్‌ చేస్తానని చెప్పేందుకు ఏ బ్యాట్స్‌మన్‌ సాకులు వెతుకోవద్దు. అదేవిధంగా ప్రతీ సారి ఆడే స్థానంలో బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదని బాధపడొద్దు. జట్టుకు అవసరమైన సమయంలో ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా పరుగులు రాబట్టాలి. ఇలా ప్రయోగాలు చేయడంతో మేమందరం ఏదో ఒక స్థానంలో కుదురుకుంటామని భావిస్తున్నా. మేము ఇంకా ప్రయోగాలు చేయాలి. ఎందుకంటే ఈ ప్రయోగాలే బహుశా మాకు మరిన్ని విజయాలను అందిస్తుంది కావచ్చు. అదేవిధంగా ఒక్కసారి మేమనుకున్న ప్రణాళికలు విఫలమవ్వచ్చు. ఆటలో ఇవన్నీ సహజమే. మా ప్రణాళికలు సఫలమైనా/విఫలమైన ప్రతిసారి మేము ఏదో ఒకటి నేర్చుకుంటున్నాము. ఇక బుమ్రా బౌలింగ్‌ గురించి మాకు ఎలాంటి ఆందోళన లేదు. గతంలో ఏ విధంగా అయితే బౌలింగ్‌ చేశాడో ఇప్పుడూ అలాగే బౌలింగ్‌ చేస్తున్నాడు. అతడి బౌలింగ్‌లో పేస్‌, పదును తగ్గలేదు. ఇంతకంటే ఎక్కువ బుమ్రా గురించి మాట్లాడదల్చుకోలేదు. రెండో వన్డేలో మేము పుంజుకుంటామనే విశ్వాసం ఉంది’ అంటూ అయ్యర్‌ పేర్కొన్నాడు.

చదవండి: 
వావ్‌ ఇట్స్‌ అమేజింగ్‌.. మాలిక్‌ వచ్చేశాడు! 
ధోని చివరి మ్యాచ్‌ ఆడేశాడా?

మరిన్ని వార్తలు