జంపా ఊరించాడు.. కోహ్లి దొరికేశాడు

14 Jan, 2020 16:06 IST|Sakshi

ముంబై: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(16) నిరాశపరిచాడు.  కేఎల్‌ రాహుల్‌(47) ఔటైన తర్వాత నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లి.. ఆడమ్‌ జంపా ఊరిస్తూ వేసిన బంతికి స్టయిట్‌ డ్రైవ్‌ కొట్టబోయి రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చాడు. అంతకుముందు బంతిని సిక్స్‌ కొట్టిన కోహ్లి.. ఆపై మళ్లీ బంతిని హిట్‌ చేద్దామనుకునే వికెట్‌ను సమర్పించుకున్నాడు. దాంతో భారత్‌ 156 పరుగుల వద్ద నాల్గో వికెట్‌ను కోల్పోయింది. టీమిండియా 134 పరుగుల వద్ద రాహుల్‌ వికెట్‌ను కోల్పోతే, ఆపై నాలుగు పరుగుల వ్యవధిలో ధావన్‌(74) సైతం పెవిలియన్‌ చేరాడు. కాసేపటికి కోహ్లి ఔట్‌ కావడంతో టీమిండియా కష్టాల్లో పడింది.

రాహుల్‌ హాఫ్‌ సెంచరీకి చేరువ అవుతున్న సమయంలో ఆగర్‌ వేసిన బంతికి సింపుల్‌ క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు. 28 ఓవర్‌ తొలి బంతిని కవర్స్‌ మీదుగా తేలికపాటి షాట్‌ కొట్టాడు. కాగా, అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న స్టీవ్‌ స్మిత్‌ దాన్ని క్యాచ్‌గా అందుకోవడంతో రాహుల్‌ హాఫ్‌ సెంచరీని తృటిలో మిస్సయ్యాడు. ఆపై స్వల్ప విరామంలో ధావన్, కోహ్లిలు ఔట్‌ కావడంతో భారత్‌ స్కోరు మందగించింది. శ్రేయస్‌ అయ్యర్‌(4) సైతం నిరాశపరిచాడు. స్టార్క్‌ బౌలిం‌గ్‌లో కీపర్‌ క్యారీకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో భారత్‌ 164 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది. (ఇక్కడ చదవండి: ఈసారి ‘సెంచరీ’ లేదు!)

మరిన్ని వార్తలు