అది విడ్డూరంగా ఉంది: భజ్జీ

16 Jan, 2020 17:31 IST|Sakshi

క్రికెట్‌లో ఏ జట్టైన ప్రయోగాలు చేసి గెలిచినప్పుడు అంతా బాగానే ఉంటుంది.. అదే ప్రయోగం బెడిసికొట్టి ఓడిపోతే దాని ప్రభావం మామూలుగా ఉండదు. ప్రస్తుతం టీమిండియా పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో కోహ్లి సేన ఘోర ఓటమి చవిచూసింది. అయితే ఈ మ్యాచ్‌లో సారథి విరాట్‌ కోహ్లి టీమాండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు చేశాడు. అది కాస్త బెడిసికొట్టింది. దీంతో ఇంటా బయటా కోహ్లి విమర్శల పాలవుతున్నాడు. ఇప్పటికే పాకిస్తాన్‌ మాజీ బౌలర్‌ షోయాబ్‌ అక్తర్‌ కోహ్లి బ్యాటింగ్‌ ఆర్డర్‌ మార్పుపై పెదవి విరవగా.. తాజాగా టీమిండియా స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ కూడా టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయాన్ని తప్పుపట్టాడు. 

‘మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి విరాట్‌ కోహ్లి టీమిండియాకు ఎన్నో అపూర్వ విజయాలను అందించాడు. ముంబైలో జరిగిన వన్డేలో కోహ్లి తన బ్యాటింగ్‌ ఆర్డర్‌ను మార్చుకోవాల్సింది కాదు. కీలక మ్యాచ్‌ల్లో కోహ్లి వంటి స్టార్‌ బ్యాట్స్‌మన్‌ ఒకరి కోసం తన స్థానాన్ని త్యాగం చేయడం విడ్డూరంగా ఉంది’ అని భజ్జీ అభిప్రాయపడ్డాడు. కేఎల్‌ రాహుల్‌ కోసం కోహ్లి నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన విషయం తెలిసిందే. దీంతో రెగ్యులర్‌గా నాలుగో స్థానంలో వచ్చే శ్రేయస్‌ అయ్యర్‌ ఐదో స్థానంలో వచ్చి దారుణంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పుల కారణంగా ఆటగాళ్లలో స్థైర్యం దెబ్బతింటుందని, ఆసీస్‌ వంటి బలమైన జట్టును ఢీ కొట్టే సమయంలో ఇలాంటి ప్రయోగాలు జట్టుకు చేటు చేస్తాయని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇరుజట్ల మధ్య రెండో వన్డే రాజ్‌కోట్‌ వేదికగా రేపు(శుక్రవారం) జరగనుంది.  

చదవండి:
ధోని చివరి మ్యాచ్‌ ఆడేశాడా?
ఆ మ్యాచ్‌తోనే హర్భజన్‌కు ఫిదా అయ్యా

మరిన్ని వార్తలు