టీమిండియాపైనే వన్డే అరంగేట్రం!

9 Jan, 2020 12:19 IST|Sakshi

వారిని ఓడించే సత్తా మాలో ఉంది..

మెల్‌బోర్న్‌: గత కొంతకాలంగా ఆస్ట్రేలియా టెస్టు జట్టులో లబూషేన్‌ రెగ్యులర్‌ ఆటగాడిగా మారిపోయాడు. వరుసగా పరుగుల మోత మోగిస్తూ ఆసీస్‌ టెస్టు జట్టులో ప్రత్యేక ముద్ర వేశాడు లబూషేన్‌. అతని రాకతో ఆసీస్‌ జట్టు మరింత బలోపేతం అయ్యిందనడంలో ఎటువంటి సందేహం లేదు. గతేడాది వెయ్యి టెస్టు పరుగులకు పైగా సాధించి ఆ ఫీట్‌ సాధించిన ఏకైక ఆటగాడిగా లబూషేన్‌ నిలవడం అతని ఆటకు అద్దం పడుతోంది. కాగా, ఇప్పటివరకూ సుదీర్ఘ ఫార్మాట్‌కు మాత్రమే పరిమితమైన లబూషేన్‌.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అరంగేట్రం చేయడానికి కూడా రంగం సిద్ధమైంది.  ఈనెలలో టీమిండియాతో వన్డే సిరీస్‌ నేపథ్యంలో లబూషేన్‌ అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమైంది. దీనిపై ఆసీస్‌ జట్టు కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు.

టెస్టుల్లో భీకరమైన ఫామ్‌లో ఉన్న లబూషేన్‌ను వన్డేల్లో తీసుకోవడానికి సమయం ఆసన్నమైందన్నాడు. ఈ క్రమంలోనే భారత్‌తో పోరుకు పక్కా ప్రణాళికతో సిద్ధం అవుతున్నట్లు తెలిపాడు. ‘ భారత్‌లో ఆ జట్టుతో పోరు ఎలా ఉంటుందో మాకు తెలుసు. మా ప్రణాళిక మాకు ఉంది. భారత్‌పై ఎప్పుడూ అనుమాన పడుతూ గేమ్‌ ప్లాన్‌ను అవలంభించకూడదు. అలా చేస్తే టీమిండియా ముందుగానే పైచేయి సాధిస్తుంది. ఏది జరిగిన టీమిండియాపై దూకుడుగా ఆడి సత్తాచాటతాం. భారత్‌ను వారి దేశంలో ఓడించే సత్తా మాకు ఉంది. మా ఆటగాళ్ల ప్రదర్శనపై నాకు నమ్మకం ఉంది. టీమిండియాను ఓడించే ఆత్మవిశ్వాసం మాలో ఉంది.

టెస్టుల్లో సత్తాచాటిన లబూషేన్‌ వన్డే అరంగేట్రం అతి త్వరలోనే ఉంటుంది. ప్రధానంగా లబూషేన్‌ స్పిన్నర్లను బాగా ఆడతాడు. అది భారత్‌లో మాకు సహకరిస్తుంది. తన ఫామ్‌ను కొనసాగిస్తాడని ఆశిస్తున్నా’ అని ఫించ్‌ తెలిపాడు. జనవరి 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ భారత్‌-ఆసీస్‌ల మధ్య మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌ జరుగనుంది. ప్రస్తుతం భారత్‌ పర్యటనలో ఉన్న శ్రీలంక చివరి టీ20 ముగిసిన తర్వాత స్వదేశానికి పయనమవుతుంది. శుక్రవారం భారత్‌-శ్రీలంకల మధ్య చివరిదైన మూడో టీ20 జరుగనుంది.

మరిన్ని వార్తలు