ఆ రికార్డుకు వికెట్‌ దూరంలో చహల్‌

9 Nov, 2019 14:32 IST|Sakshi

నాగ్‌పూర్‌: పొట్టి ఫార్మాట్‌లో తనదైన మార్కుతో మ్యాజిక్‌ చేస్తూ భారత క్రికెట్‌ జట్టులో రెగ్యులర్‌ స్పిన్నర్‌గా మారిన యజ్వేంద్ర చహల్‌ను ఒక అరుదైన రికార్డు ఊరిస్తోంది. అంతర్జాతీయ టీ20ల్లో చహల్‌ మరో వికెట్‌ సాధిస్తే జస్‌ప్రీత్‌ బుమ్రా, రవి చంద్రన్‌ అశ్విన్‌ల సరసన చేరతాడు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో అశ్విన్‌(52) తొలి స్థానంలో ఉండగా, బుమ్రా(51) రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరి సరసన నిలిచేందుకు చహల్‌ సిద్ధమవుతున్నాడు. 

బంగ్లాతో తొలి టీ20లో వికెట్‌ తీసిన చహల్‌.. రెండో టీ20లో రెండు వికెట్లు సాధించాడు. ప్రస్తుతం చహల్‌ 49 వికెట్లతో వీరి తర్వాత స్థానంలో ఉన్నాడు. మరో వికెట్‌ తీస్తే ఇంటర్నేషనల్‌ టీ20ల్లో 50 వికెట్లు సాధించిన మూడో భారత బౌలర్‌గా చహల్‌ నిలుస్తాడు. బంగ్లాదేశ్‌తో ఆదివారం జరుగనున్న మూడో టీ20లో చహల్‌ ఈ మార్కును చేరే అవకాశం ఉంది. రేపటి మ్యాచ్‌లో చహల్‌ మూడు వికెట్లు సాధిస్తే భారత్‌ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన అశ్విన్‌ సరసన చహల్‌ చోటు సంపాదిస్తాడు.

ఇక రోహిత్‌ శర్మ మరో రెండు సిక్సర్లు కొడితే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 400 సిక్సర్ల మార్కును చేరతాడు. అదే సమయంలో భారత్‌ నుంచి ఈ ఫీట్‌ సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డును నమోదు చేస్తాడు. తొలి టీ20లో విఫలైమన రోహిత్‌.. రెండో టీ20లో బౌండరీల మోత మోగించాడు. ఆరు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 85 పరుగులు సాధించాడు. రోహిత్‌ జోరుతో టీమిండియా రెండో టీ20లో సునాయాసంగా విజయం సాధించింది. తొలి టీ20ని బంగ్లాదేశ్‌ గెలవడంతో ప్రస్తుతం సిరీస్‌ 1-1తో సమంగా ఉంది. చివరి టీ20లో గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.

మరిన్ని వార్తలు