పంత్‌ను మరోసారి వెనకేసుకొచ్చిన దాదా

8 Nov, 2019 19:25 IST|Sakshi

ముంబై: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టీ20ల్లో అటు కీపింగ్‌, ఇటు బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన యువ సంచలనం రిషభ్‌ పంత్‌పై అన్ని వైపులా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొలి టీ20లో పంత్‌ ఏమరపాటుతో టీమిండియా డీఆర్‌ఎస్‌ కోల్పోగా.. రెండో టీ20లో అత్యుత్సాహం ప్రదర్శించడంతో స్టంపౌట్‌ కాస్తా నాటౌట్‌ అయింది. ఈ క్రమంలో పంత్‌ను కనీసం కొన్ని మ్యాచ్‌లైనా పక్కకు పెడితేనే మంచిదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమయంలో పంత్‌కు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అండగా నిలిచాడు. పంత్‌ సూపర్బ్‌ ప్లేయర్‌ అంటూ కితాబిచ్చాడు.   

‘పంత్‌ నెమ్మదిగా పరిణతి చెందుతున్నాడు. అతడికి కాస్త సమయం ఇవ్వండి. పంత్‌ ఒత్తిడిలో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే అతడిపై ఎలాంటి ప్రెషర్‌ లేకుండా చూడాలి. పంత్‌​లో ఆపార ప్రతిభ దాగుంది. అతడు సూపర్బ్‌ ప్లేయర్‌. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా అద్భుతంగా ఆడింది’ అంటూ దాదా పేర్కొన్నాడు. ఇక ప్రపంచకప్‌, ఆ తర్వాత పంత్‌పై విమర్శలు వచ్చిన సమయంలో కూడా అతడికి గంగూలీ బాసటగా నిలిచిని విషయం తెలిసిందే. దాదా అండ ఉండటంతోనే పంత్‌ ఎన్నిసార్లు విఫలమైనా టీమిండియాలో చోటు దక్కుతోందని పలువురు విమర్శిస్తున్నారు. 

రెండో టీ20లో పంత్‌కు బ్యాటింగ్‌ అవకాశం రాలేదు.. అయితే కీపింగ్‌లో విఫలమయ్యాడు. రాజ్‌కోట్‌ మ్యాచ్‌లో పంత్‌ పలుమార్లు అత్యుత్సాహం ప్రదర్శించాడు. బౌండరీ నుంచి ఫీల్డర్‌ విసిరిన బంతులను సరిగా క్యాచ్‌ చేయలేకపోవడంతో ఎక్స్‌ట్రా బై రన్స్‌ వచ్చాయి. ఇక లిట​న్‌ దాస్‌ను సులువుగా స్టంపౌట్‌ చేసే అవకాశం లభించినప్పటికీ పంత్‌ తొందరపాటు బ్యాట్స్‌మన్‌కు వరంగా మారింది. మరో బంగ్లా బ్యాట్స్‌మన్‌ విషయంలో కూడా సేమ్‌ ఇలాంటి సీనే రిపీట్‌ అయినప్పటికీ అదృష్టం కలిసొచ్చి పంత్‌ ఖాతాలో స్టంపౌట్‌ పడింది. ఇక తొలి టీ20లో అటు బ్యాటింగ్‌, ఇటు కీపింగ్‌ రెండింటిలోనూ పంత్‌ దారుణంగా విఫలమవడంతో అతడిపై విమర్శల తాకిడి పెరిగింది. ఇక మూడో టీ20లో పంత్‌కు చివరి అవకాశం ఇచ్చి పరీక్షిస్తారా లేక పక్కకు పెడుతారో చూడాలి. 

మరిన్ని వార్తలు