కలలో కూడా అనుకోలేదు: చహర్‌

11 Nov, 2019 11:18 IST|Sakshi

నాగ్‌పూర్‌: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20కి ముందు పేసర్‌ దీపక్‌ చహర్‌ భారత్‌ తరఫున ఆడిన మ్యాచ్‌లు ఏడు. అందులో ఒకటి వన్డే మ్యాచ్‌ కాగా, ఆరు టీ20లు మాత్రమే ఆడాడు. అయితే బంగ్లాదేశ్‌తో జరిగిన ఆఖరి టీ20 చహర్‌ కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.  ఈ మ్యాచ్‌లో చిరస్మరణీయమైన ప్రదర్శనతో చహర్‌ ఒక్కసారిగా రేసులోకి వచ్చేశాడు. బంగ్లాతో సిరీస్‌ నిర్ణయాత్మక ఆఖరి టీ20లో హ్యాట్రిక్‌తో పాటు మొత్తంగా ఆరు వికెట్లను చహర్‌ ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా భారత్‌ తరఫున అంతర్జాతీయ టి20ల్లో ‘హ్యాట్రిక్‌’ తీసిన తొలి బౌలర్‌ రికార్డు సాధించాడు. (ఇక్కడ చదవండి: చహర్‌ సిక్సర్‌... భారత్‌ విన్నర్‌)

మరొకవైపు అంతర్జాతీయ టి20ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు.తన ప్రదర్శనపై పోస్ట్‌ మ్యాచ్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చహర్‌.. ఈ ఘనతపై పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ‘ నేనెప్పుడు ఈ తరహా ప్రదర్శన చేస్తానని కలలో కూడా అనుకోలేదు. కాకపోతే నా కష్టానికి ఫలితం వచ్చింది. నా చిన్నతనం నుంచి క్రికెట్‌లో రాణించడం కోసం శ్రమిస్తూనే ఉన్నాను. అందుకు ఫలితం ఇన్నాళ్లకు వచ్చిందేమో’ అని ఆనందం వ్యక్తం చేశాడు.

ఈ సిరీస్‌లో దీపక్‌ చాహర్‌ 10.2 ఓవర్లు వేసి 56 పరుగులివ్వడమే కాకుండా ఎనిమిది వికెట్లు సాధించాడు. చివరి మ్యాచ్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కించుకోవడమే కాకుండా మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా కూడా నిలిచాడు.  బంగ్లాతో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో చహర్‌ తన తొలి ఓవర్లో 2 వికెట్లు తీసి 1 పరుగు మాత్రమే ఇచ్చాడు. కొంత విరామం తర్వాత మళ్లీ వచ్చి కీలకమైన మిథున్‌ వికెట్‌ తీయడంతో పాటు 4 పరుగులే ఇచ్చాడు. ఈ మూడు వికెట్ల తర్వాత తీసిన మరో మూడు వికెట్లు అతని ఖాతాలో ‘హ్యాట్రిక్‌’ను చేర్చాయి. 18వ ఓవర్‌ చివరి బంతికి షఫీయుల్‌ వికెట్‌ను... ఆ తర్వాత 20వ ఓవర్‌ తొలి రెండు బంతులకు ముస్తఫిజుర్, అమీనుల్‌లను అవుట్‌ చేసి చహర్‌ హ్యాట్రిక్‌తో రికార్డు నమోదు చేశాడు.

మరిన్ని వార్తలు