పింక్‌ బాల్‌ టెస్టు: 38 పరుగులకే బంగ్లాదేశ్‌..

22 Nov, 2019 14:52 IST|Sakshi

కోల్‌కతా:  టీమిండియాతో ఇక్కడ పింక్‌ బాల్‌తో జరుగుతున్న డే అండ్‌ నైట్‌ టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ విలవిల్లాడుతోంది. బంగ్లాదేశ్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా స్కోరు బోర్డుపై 50 పరుగులు కూడా లేకుండానే సగం వికెట్లను కోల్పోయింది. భారత పేసర్లు చెలరేగిపోతూ బంతులు వేయడంతో బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ చెల్లాచెదురైంది. భారత పేసర్ల దెబ్బకు బంగ్లాదేశ్‌ 38 పరుగులకే ఐదు వికెట్లను చేజార్చుకుంది.  టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ను షాద్‌మన్‌ ఇస్లామ్‌-ఇమ్రుల్‌ కేయిస్‌లు ప్రారంభించారు. బంగ్లా 15 పరుగుల వద్ద ఉండగా ఇమ్రుల్‌(4) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఇమ్రుల్‌ను ఇషాంత్‌ శర్మ ఎల్బీగా ఔట్‌ చేశాడు.(ఇక్కడ చదవండి: నాలుగు వికెట్లు.. మూడు డకౌట్లు)

ఆపై కెప్టెన్‌ మోమినుల్‌ హక్‌, మహ్మద్‌ మిథున్‌, ముష్పికర్‌ రహీమ్‌లు డకౌట్లుగా పెవిలియన్‌ చేరారు. మోమినుల్‌, మిథున్‌లను ఉమేశ్‌ యాదవ్‌ ఔట్‌ చేయగా, రహీమ్‌ను షమీ పెవిలియన్‌కు పంపాడు. మూడు బంతుల వ్యవధిలో ఉమేశ్‌ రెండు వికెట్లు తీసి బంగ్లాను గట్టిదెబ్బ కొట్టాడు. దాంతో బంగ్లాదేశ్‌ 26 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ నష్టపోయింది. కాగా, భారత బౌలర్లను కాస్త ప‍్రతిఘటించినట్లే కనబడిన షాద్‌మన్‌ ఇస్లామ్‌(29; 52 బంతుల్లో 5 ఫోర్లు)ను ఉమేశ్‌ చక్కటి బంతితో ఔట్‌ చేశాడు. కాస్త స్వింగ్‌ మిక్స్‌ చేసిన బంతికి షాద్‌మన్‌.. కీపర్‌ సాహాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఆరో వికెట్‌గా మహ్మదుల్లా(6) ఔటయ్యాడు. ఇషాంత్‌ శర్మ వేసిన 20 ఓవర్‌ నాల్గో బంతికి మహ్మదుల్లా కీపర్‌ సాహాకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. క్యాచ్‌ అందుకునే క్రమంలో సాహా మరోసారి ఆకట్టుకున్నాడు. ఫస్ట్‌స్లిప్‌కు కాస్త ముందు పడబోతున్న బంతిని చక్కని టైమింగ్‌తో ఒడిసి పట్టుకున్నాడు. దాంతో 60 పరుగులకే బంగ్లాదేశ్‌ ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ ఆరు వికెట్లలో ఉమేశ్‌ యాదవ్‌ మూడు వికెట్లు సాధించగా, ఇషాంత్‌ శర్మ రెండు వికెట్లు తీశాడు. షమీకి వికెట్‌ దక్కింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా