కొత్త చరిత్రకు స్వల్ప దూరంలో కోహ్లి..

21 Nov, 2019 14:01 IST|Sakshi

కోల్‌కతా: ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని మరో రికార్డు ఊరిస్తోంది. బంగ్లాదేశ్‌తో శుక్రవారం ఆరంభమయ్యే పింక్‌ బాల్‌ టెస్టులో కోహ్లి మరో రికార్డును ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకూ 83 టెస్టులు ఆడి 7,066 పరుగులు చేసిన కోహ్లి.. ఒక కెప్టెన్‌గా అరుదైన రికార్డును నమోదు చేయడానికి స్వల్ప దూరంలో ఉన్నాడు. భారత టెస్టు కెప్టెన్‌గా ఐదువేల పరుగుల మార్కును అందుకోవడానికి 32 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇ‍ప్పటివరకూ భారత్‌ తరఫున 52 టెస్టు మ్యాచ్‌లకు సారథ్యం వహించిన కోహ్లి 4,968 పరుగులతో ఉన్నాడు. ఇంకా 32 పరుగులు చేస్తే టెస్టుల్లో ఐదు వేల పరుగుల చేరిన కెప్టెన్ల జాబితాలో చేరిపోతాడు.

అలాగే కెప్టెన్‌గా ఐదువేల పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్‌గా కూడా కోహ్లి చరిత్ర సృష్టిస్తాడు. అదే సమయంలో కెప్టెన్‌గా ఐదువేల టెస్టు పరుగులు చేసిన ఆరో క్రికెటర్‌గా నిలుస్తాడు. ఈ జాబితాలో గ్రేమ్‌ స్మిత్‌(దక్షిణాఫ్రికా-8,659 పరుగులు), అలెన్‌ బోర్డర్‌(ఆస్ట్రేలియా-6,623 పరుగులు), రికీ పాంటింగ్‌( ఆస్ట్రేలియా-6,542 పరుగులు), క్లైవ్‌ లాయిడ్‌(వెస్టిండీస్‌-5,233), స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌( 5,156)లు ఉన్నారు.  ఇప్పుడు కోహ్లి ముంగిట ఈ రికార్డు నిలిచింది. అది కూడా భారత్‌ తొలిసారి ఆడుతున్న చారిత్రక డే అండ్‌ నైట్‌ టెస్టు కావడంతో  కోహ్లి ఇక్కడే కెప్టెన్‌గా ఐదు వేల టెస్టు పరుగులు చేయాలని అతని అభిమానులు ఆశిస్తున్నారు.బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో కోహ్లి డకౌట్‌గా ఔటైన సంగతి తెలిసిందే. రెండు బంతులు మాత్రమే ఆడి పరుగులేమీ చేయకుండా నిష్క్రమించాడు. కానీ ఈ మ్యాచ్‌లో భారత్‌ ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో గెలిచింది.

>
మరిన్ని వార్తలు