కోహ్లికే దిమ్మతిరిగేలా..

23 Nov, 2019 16:42 IST|Sakshi

కోల్‌కతా: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్టులో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మంచి ఊపు మీద ఉన్న సమయంలో నిష్క్రమించాడు. కోహ్లి సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం 136  పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా ఇచ్చిన క్యాచ్‌ను బంగ్లాదేశ్‌ ఫీల్డర్‌ తైజుల్‌ ఇస్లామ్‌ కళ్లు చెదిరే రీతిలో ఎగిరి మరీ పట్టేసుకున్నాడు. అసలే శతకం పూర్తి చేసి ఉన్న కోహ్లి క్యాచ్‌ను వదిలేస్తే డబుల్‌ సెంచరీ ఖాయం అనుకున్నాడో.. ఏమో కానీ తైజుల్‌ క్యాచ్‌ను మిస్‌ చేయకూడదనే కసి కనిపించింది.

భారత్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా 81 ఓవర్‌ను ఎబాదత్‌ వేయగా తొలి బంతిని కోహ్లి ఫోర్‌ కొట్టాడు. రెండో బంతిని డిఫెన్స్‌ ఆడగా, మూడో బంతిని మరో షాట్‌ కొట్టే యత్నం చేశాడు. లెగ్‌ సైడ్‌ ఒక షాట్‌కు కొట్టాడు. అది కాస్త ఉంటే బౌండరీని దాటేసేది. కానీ ఫైన్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న తైజుల్‌ గాల్లోకి అమాంతం ఎగిరి దాన్ని మెరుపు వేగంతో పట్టేసుకున్నాడు. తైజుల్‌ గాల్లో డైవ్‌ కొట్టిన తీరు కోహ్లినే షాక్‌కు గురి చేసింది. ఆ క్యాచ్‌ను తైజుల్‌ ఎలా అందుకున్నాడో అర్థం కాక కోహ్లి కాసేపు అలానే ఉండిపోయాడు. కాగా, అది ఔట్‌ కావడంతో కోహ్లి భారంగా పెవిలియన్‌ వీడాడు. కోహ్లి ఆరో వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, కాసేపటికి అశ్విన్‌(9) కూడా ఔటయ్యాడు. దాంతో భారత్‌ జట్టు 329 పరుగుల వద్ద ఏడో వికెట్‌ను కోల్పోయింది. అంతకుముందు జడేజా(12), రహానే(51)లు ఔటయ్యారు.

మరిన్ని వార్తలు