‘ఆ ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొడదామనుకున్నా’ 

8 Nov, 2019 16:55 IST|Sakshi

‘ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు’ఇది వినగానే ఠక్కున గుర్తుకొచ్చే పేరు యువరాజ్‌ సింగ్‌. 2007లో టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా స్టువార్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో ఆ ఘనత సాధించాడు. అయితే ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో మరే క్రికెటర్‌ ఆ ఘనతను అందుకోలేకపోయాడు. అయితే ఈ రికార్డుపై టీమిండియా హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ కన్ను పడినట్లు తాజాగా తెలుస్తోంది. గురువారం రాజ్‌కోట్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో రోహిత్‌ శర్మ సుడిగాలి ఇన్నింగ్స్‌తో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 6 ఫోర్లు... 6 సిక్సర్లతో బంగ్లా బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్‌ కేవలం 43 బంతుల్లోనే 85 పరుగులు సాధించి టీమిండియా విజయాన్ని సులభతరం చేశాడు. 

ఇక టీమిండియా ఇన్నింగ్స్‌ సందర్భంగా పదో ఓవర్‌ హైలెట్‌గా నిలిచింది. బంగ్లా ఆఫ్‌ స్పిన్నర్‌ మొసద్దిక్‌ హుస్సేన్‌ వేసిన ఆ ఓవర్‌లో టీమిండియా హిట్‌మ్యాన్‌ ఏకంగా 21 పరుగులు పిండుకున్నాడు. వరుసగా మూడు సిక్సర్లు కొట్టిన రోహిత్‌ జోరు చూస్తే ఆరు సిక్సర్ల ఘనత అందుకుంటాని అందరూ భావించారు. అయితే నాలుగో బంతిని మొసద్దిక్‌ చాలా తెలివిగా వేయడంతో డాట్‌ బాల్‌ అయింది. దీంతో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్ల ఘనత చూద్దామనుకున్న రోహిత్‌ ఫ్యాన్స్‌కు నిరేశే ఎదురైంది. (చదవండి: రోహిత్‌ తిట్ల దండకం)

అయితే ఇదే విషయంపై మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ స్పందించాడు. మొసద్దిక్‌ వేసిన పదో ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టాలని నిశ్చయించుకున్నట్లు వెల్లడించాడు. వరుసగా మూడు సిక్సర్లు కొట్టాక.. నాలుగో బంతి డాట్‌ బాల్‌ కావడంతో ఇక సింగిల్స్‌ తీద్దామని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. దీంతో ‘ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు’ ఘనత సాధించాలనే తన మనసులోని కోరికను రోహిత్‌ బయటపెట్టాడని క్రీడావిశ్లేషకులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ప్రస్తుత క్రికెట్‌లో ఆ ఘనత సాధించగల సత్తా రోహిత్‌కే ఉందంటూ అతడి ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు