షకిబుల్‌ ప్రాక్టీస్‌కు రాలేదు..!

26 Oct, 2019 13:28 IST|Sakshi

మిర్పూర్‌: త్వరలో భారత్‌ పర్యటనకు రానున్న బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు అప్పుడే ప్రాక్టీస్‌ మొదలుపెట్టేసింది. భారత్‌తో సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. కొత్త బౌలింగ్‌ కోచ్‌ డానియెల్‌ వెటోరి పర్యవేక్షణలో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు ప్రాక్టీస్‌కు శ్రీకారం చుట్టారు. శుక‍్రవారం మిర్పూర్‌లోని షేర్‌ బంగ్లా నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో నిర్వహించిన  ప్రాక్టీస్‌ సెషన్‌కు దాదాపు అందరూ హాజరు కాగా సీనియర్‌ ఆటగాడు షకీబుల్‌ హసన్‌ మాత్రం గైర్హాజరీ అయ్యాడు. ఇటీవల తమ డిమాండ్లను నెరవేర్చాంటూ బంగ్లాదేశ్‌క్రికెటర్లు స్టైక్‌కు చేపట్టి విజయం సాధించారు. షకీబుల్‌ నేతృత్వంలోని బంగ్లా క్రికెటర్లు తమ నిరసన గళాన్ని బలంగా వినిపించింది. దాంతో బీసీబీ దిగొచ్చింది.

బంగ్లాదేశ్‌ కోరిన 11 డిమాండ్లలో తొమ్మిదింటిని తీర్చడానికి బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు(బీసీబీ) ముందుకు రావడంతో సమ్మెకు ఫుల్‌స్టాప్‌ పడింది. ఆ క్రమంలోనే భారత్‌ పర్యటనకు మార్గం సుగమం అయ్యింది. దాంతో సదరు క్రికెటర్లు తమ ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. కొన్ని రోజుల క్రితం బౌలింగ్‌ కోచ్‌గా ఎంపికైన వెటోరీ.. ఆటగాళ్లకు బంతులు విసురుతూ ప్రాక్టీస్‌ చేయించాడు. భారత మాజీ స్పిన్నర్‌ సునీల్‌ జోషి స్థానంలో వెటోరిని బౌలింగ్‌ కోచ్‌గా నియమిస్తూ బీసీబీ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌ వరకూ వెటోరి బంగ్లా బౌలింగ్‌ కోచ్‌గా కొనసాగనున్నాడు. వచ్చే నెల 3వ తేదీన ఢిల్లీలో జరుగనున్న తొలి టీ20 మ్యాచ్‌తో భారత్‌-బంగ్లాదేశ్‌ల ద్వైపాక్షిక సిరీస్‌ ఆరంభం కానుంది. అక్టోబర్‌ 30వ తేదీ నాటికి బంగ్లా క్రికెటర్లు.. భారత్‌కు వచ్చే అవకాశం ఉంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు