ఇద్దరూ కలిసి హ్యాట్రిక్‌..!

14 Nov, 2019 16:55 IST|Sakshi

ఇండోర్‌: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ తన మొదటి ఇన్నింగ్స్‌లో తేలిపోయింది. ఈరోజు తొలి రోజు ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్‌.. టీ బ్రేక్‌ తర్వాత తమ ఇన్నింగ్స్‌ను 58.3 ఓవర్లలో 150 పరుగుల వద్ద ముగించింది. భారత బౌలర్లు మహ్మద్‌ షమీ మూడు వికెట్లు  సాధించగా, ఉమేశ్‌, అశ్విన్‌ ఇషాంత్‌లు తలో రెండు వికెట్లు తీశారు. ఒక వికెట్‌ రనౌట్‌ రూపంలో లభించింది.

కాగా, బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా పేసర్‌ షమీ హ్యాట్రిక్‌ తీసే అవకాశాన్ని కోల్పోయాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో భాగంగా 54 ఓవర్‌ ఐదో బంతికి ముష్ఫికర్‌ రహీమ్‌ వికెట్‌ తీసిన షమీ.. ఆ మరుసటి బంతికి మెహిదీ హసన్‌ గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌కు పంపాడు.  ఈ క్రమంలోనే టీ బ్రేక్‌ రాగా, షమీని హ్యాట్రిక్‌ ఊరించింది. కాగా, టీ విరామం తర్వాత షమీ మరొక ఓవర్‌ను అందుకోవడానికి ముందే ఇషాంత్‌ శర్మ వేసిన 55 ఓవర్‌ మొదటి బంతికే లిటాన్‌ దాస్‌ ఔటయ్యాడు. స్లిప్‌లో కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి వికెట్‌ కోల్పోయాడు. దాంతో షమీ, ఇషాంత్‌లు సంయుక్తంగా టీమ్‌ హ్యాట్రిక్‌ను సాధించారు.

బంగ్లాదేశ్‌ స్కోరు 140 పరుగుల వద్ద ఉండగా వరుసగా మూడు వికెట్లు కోల్పోవడంతో అది కంబైన్డ్‌ హ్యాట్రిక్‌గా నమోదైంది. ఆపై షమీ వేసిన ఓవర్‌లో అతని వ్యక్తిగత హ్యాట్రిక్‌ సాధిస్తాడేమోనని ఎదురుచూసినా అది జరగలేదు. కాకపోతే సంయుక్తంగా హ్యాట్రిక్‌ రావడమే భారత పేస్‌ బౌలింగ్‌ ధాటిగా అద్దం పడుతోంది. బంగ్లా తన చివరి రెండు వికెట్లలో ఒక రనౌట్‌ కాగా, మరొక వికెట్‌ను ఉమేశ్‌ యాదవ్‌ తీశాడు. ఫలితంగా బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. అటు తర్వాత బ్యాటింగ్‌ చేపట్టిన భారత జట్టు ఆరంభంలోనే రోహిత్‌ శర్మ(6) వికెట్‌ను కోల్పోయింది. అబు జాయేద్‌ బౌలింగ్‌లో రోహిత్‌ ఔటయ్యాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ వికెట్‌ నష్టానికి 86 పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌(37 బ్యాటింగ్‌), పుజారా(43 బ్యాటింగ్‌)లు క్రీజ్‌లో ఉన్నారు. 

>
మరిన్ని వార్తలు