‘ధోనిని అధిగమించాడు.. బోర్డర్‌ సరసన చేరాడు’

16 Nov, 2019 20:40 IST|Sakshi

ఇండోర్‌: ‘వేదిక ఏదైనా.. ప్రత్యర్థి ఎవరైనా.. ఫలితం ఒకటే.. రిజల్ట్‌ రిపీట్‌.. హిస్టరీ క్రియేట్‌’ప్రస్తుతం టీమిండియా టెస్టు విజయాల పరంపరం చూస్తుంటే ప్రతీ ఒక్కరూ ఇదే అనుకుంటున్నారు. తాజాగా రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 230 పరుగుల తేడాతో కోహ్లి సేన మరో అపూర్వ విజయం సాధించింది. ఈ భారీ విజయంతో సారథిగా కోహ్లి పలు ఘనతలను అందుకున్నాడు. ఎక్కువ ఇన్నింగ్స్‌ విజయాలను సాధించిన తొలి టీమిండియా సారథిగా  ధోని రికార్డును కోహ్లి బ్రేక్‌ చేశాడు. గతంలో ధోని కెప్టెన్సీలోని టీమిండియా 9 ఇన్నింగ్స్‌ విజయాలను సాధించగా.. ప్రస్తుతం కోహ్లి సారథ్యంలో ఇప్పటివరకు పది టెస్టు ఇన్నింగ్స్‌ విజయాలను నమోదు చేసింది. ఈ జాబితాలో అజారుద్దీన్‌(8), సౌరవ్‌ గంగూలీ(7) తరవాతి స్థానాల్లో ఉన్నారు. 

ఇక సారథిగా అత్యధిక విజయాలను సాధించడంలో ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ అలెన్‌ బోర్డర్‌ సరసన కోహ్లి చేరాడు. కోహ్లి కెప్టెన్సీలో టీమిండియా ఇప్పటివరకు 32 టెస్టు విజయాలను నమోదు చేసింది. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్‌ స్మిత్‌(53), ఆసీసీ మాజీ సారథలు రికీ పాంటింగ్‌(48), స్టీవ్‌ వా(41)లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక వరుసగా ఆరు టెస్టుల్లో విజయాలు సాధించడంతో టీమిండియాకు ఇది రెండో సారి. గతంలో 2013లో ధోని సారథ్యలో( ఆసీస్‌పై 4, విండీస్‌పై 2) భారత్‌ వరుసగా ఆరు టెస్టు విజయాలను నమోదు చేసింది. ఇక తాజాగా కోహ్లి సారథ్యంలో విండీస్‌పై 2, దక్షిణాఫ్రికాపై 3, ప్రస్తుతం బంగ్లాపై విక్టరీతో టీమిండియా వరుస టెస్టు విజయాల సంఖ్య ఆరుకు చేరింది.  

ఇక వరుసగా మూడు టెస్టుల్లో ఇన్నింగ్స్‌ విజయాలను నమోదు చేయడం టీమిండియాకు ఇది మూడో సారి. గతంలో 1992-93, 93-94 మధ్య కాలంలో వరుసగా మూడు టెస్టుల్లో ఇన్నింగ్స్‌ విజయాలను టీమిండియా నమోదు చేసింది. ఇక ఇదే ఊపులో రెండో టెస్టులోనూ కోహ్లి సేన బంగ్లా పని పడితే మరెన్నో రికార్డులు టీమిండియా పేరిట లిఖించబడటం ఖాయంగా కనిపిస్తోంది.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా