విరాట్‌ కోహ్లికి విశ్రాంతి.. మరి ధోని?

24 Oct, 2019 11:16 IST|Sakshi

న్యూఢిల్లీ: వచ్చే నెలలో బంగ్లాదేశ్‌తో జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్‌కు గత కొన్నినెలలుగా విరామం లేకుండా ఆడుతోన్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో పలువురు యువ క్రికెటర్లను పరిశీలించిన ఎంఎస్‌కే ప్రసాద్‌ నేతృత్వంలోని భారత సెలక్షన్‌ కమిటీ.. బంగ్లాదేశ్‌ పర్యటనకు సైతం అదే విధానాన్ని అవలంభించనున్నారు. బంగ్లాదేశ్‌ క్రికెటర్లు తమ సమ్మెను విరమించడంతో భారత పర్యటనకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో గురువారం బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ.. బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు జట్టును ప్రకటించే అవకాశాలు కనబడుతున్నాయి.  

ఈ నేపథ్యంలో కోహ్లికి విశ్రాంతి ఇవ్వాలనే సెలక్టర్లు చూస్తున్నారు. ఒకవేళ కోహ్లి రెస్ట్‌ తీసుకోవాడానికి మొగ్గుచూపితే అతనికి విశ్రాంతి తప్పకపోవచ్చు. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో చివరి రెండు వన్డేలతో పాటు టీ20 సిరీస్‌లో కోహ్లి ఆఖరిసారి విశ్రాంతి తీసుకున్నాడు. కాగా, చాలాకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న ఎంఎస్‌ ధోనిని ఎంపిక చేస్తారా.. లేదా అనేది ఇంకా సస్పెన్స్‌లోనే ఉంది. తాను ఆడతానని ధోని సంకేతాలు పంపితే అతని ఎంపిక ఖాయం. బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సౌరవ్‌ గంగూలీ కూడా ధోనికి మద్దతుగా నిలవడంతో సెలక్టర్లు ఏం చేస్తారనేది చూడాలి.

యశస్వికి అవకాశం..
బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు ఇటీవల విజయ్‌ హజారే ట్రోఫీలో డబుల్‌ సెంచరీ సాధించిన ముంబై యువ క్రికెటర్‌ యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో పిన్నవయసులో డబుల్‌ సెంచరీ సాధించిన క్రికెటర్‌గా యశస్వి రికార్డు నెలకొల్పడంతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించారు. ఫలితంగా జైస్వాల్‌ ఎంపికకు మొగ్గుచూపుతున్నారు. మరొకవైపు మరో యువ క్రికెటర్‌ శివం దూబే పేరును కూడా పరిశీలిస్తున్నారు. విజయ్‌ హజారే ట్రోఫీలో దూబే సెంచరీ చేయడంతో మరొకసారి వెలుగులోకి వచ్చాడు. ఈ క్రమంలోనే కేఎల్‌ రాహుల్‌, మనీష్‌ పాండేలను మరోసారి జట్టుకు దూరంగా ఉంచవచ్చు. విజయ్‌ హజారే ట్రోఫీలో కర్ణాటక జట్టు ఫైనల్‌కు వెళ్లడంలో రాహుల్‌, పాండేలు కీలక పాత్ర పోషించినా యువ క్రికెటర్ల ఎంపిక నేపథ్యంలో ఆ ఇద్దరికీ ఉద్వాసన తప్పకపోవచ్చు.

సంజూ శాంసన్‌కు చాన్స్‌
కొన్ని నిర్లక్ష్యపు షాట్లతో అర్థాంతరంగా జట్టులో చోటు కోల్పోయిన యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ను బ్యాకప్‌గా పెట్టుకోవాలని మాత్రమే టీమిండియా యోచిస్తోంది. సంజూ శాంసన్‌ను బంగ్లాదేశ్‌ సిరీస్‌కు ఎంపిక చేసేందుకు సెలక్టర్లు ఆసక్తిగా ఉన్నారు.  విజయ్‌ హజారే ట్రోఫీలో 125 స్టైక్‌రేట్‌తో 410 పరుగులు చేసిన సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వాలనే భావనలో ఎంఎస్‌కే ప్రసాద్‌ ఉన్నాడు.

మరిన్ని వార్తలు