ఖుషీ ఖుషీగా సౌరవ్‌ గంగూలీ

16 Nov, 2019 12:15 IST|Sakshi

కోల్‌కతా: భారత్‌లో తొలిసారి నిర్వహిస్తున్న పింక్‌ బాల్‌ డే అండ్‌ నైట్‌ టెస్టు మ్యాచ్‌కు దాదాపు టికెట్లన్నీ అమ్ముడుపోవడంతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఖుషీ ఖుషీగా ఉన్నాడు.  తొలి మూడు రోజుల ఆటకు సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడుపోయిన విషయాన్ని గంగూలీ శుక‍్రవారం స్పష్టం చేశాడు. ఇలా టెస్టు మ్యాచ్‌కు టికెట్లు అమ్ముడు పోవడంతో హ్యాపీగా ఉన్నామన్నాడు.‘ ఆన్‌లైన్‌లో పెట్టిన టికెట్లన్నీ సేల్‌ అయిపోయాయ్‌. కేవలం కోటా టికెట్లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా పరిమిత సంఖ్యలో ఉన్నాయి. దాంతో మేమంతా సంతోషంగా ఉన్నాం’ అని గంగూలీ పేర్కొన్నాడు.

నవంబర్‌ 22వ తేదీ నుంచి 26వ  తేదీ వరకూ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌లో భారత్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య డే అండ్‌ నైట్‌ టెస్టు జరుగనుంది. ఇది ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం పగటిపూట టెస్టు కాగా, బీసీసీఐ అధ్యక్ష హోదాలో దాన్ని డే అండ్‌ నైట్‌గా నిర్వహించాలనే గంగూలీ పట్టుబట్టారు. ఆ క్రమంలోనే బంగ్లాదేశ్‌ బోర్డును కూడా ఒప్పించారు. ఫలితంగా భారత్‌ మొదటిసారి డే అండ్‌ నైట్‌ టెస్టు మ్యాచ్‌కు సిద్ధమైంది.  ఇది డే అండ్‌ నైట్‌ టెస్టు కావడంతో ప్రేక్షకులు అధిక సంఖ్యలో టికెట్లు కొనుగోలు చేశారు. ఆఫీసులు ముగిసిన తర్వాత మ్యాచ్‌ను చూడటానికి జనం వస్తారనే ఆలోచనతోనే ఇలా డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌ను  నిర్వహించడానికి గంగూలీ నిర్ణయం తీసుకున్నాడు. తన ఆలోచన సక్సెస్‌ కావడంతో గంగూలీ జోష్‌లో ఉన్నాడు.

మరిన్ని వార్తలు