-

నాలుగు ఢమాల్‌.. ఆశలు పోయినట్లేనా?

23 Feb, 2020 11:17 IST|Sakshi

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జేమీసన్‌కు దాసోహమైన టీమిండియా టాపార్డర్‌ రెండో ఇన్నింగ్స్‌లో ట్రెంట్‌ బౌల్ట్‌ దెబ్బకు కుదేలైంది. పరువు కోసం తప్పక పోరాడాల్సిన స్థితిలో పృథ్వీషా(14), పుజారా(11), కోహ్లి(19) చేతులెత్తేశారు. ఈ ముగ్గురు కూడా బౌల్ట్‌ బౌలింగ్‌కే బలి కావడం గమనార్హం. మూడో రోజు 183 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్‌ను టీమిండియా ఆరంభించింది. మయాంక్‌ అగర్వాల్‌(58) మినహా.. మిగతా బ్యాట్స్‌మన్‌ ఎవరు కూడా పరుగులు కాదుకదా కనీసం క్రీజులో కూడా నిలదొక్కుకోలేకపోయారు. బౌల్ట్‌ దాటికి వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. అయితే తన అర్థసెంచరీని భారీ స్కోర్‌గా మలచకుండా టిమ్‌ సౌతీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానేతో పాటు తెలుగు కుర్రాడు హనుమ విహారీ క్రీజులో ఉన్నారు. 

కోహ్లి మరీ ఘోరంగా..
టీ విరామానికి ముందు పుజారా ఔటయ్యాడు. దీంతో క్రీజులోకి వచ్చిన సారథి విరాట్‌ కోహ్లి పైనే టీమిండియా భారం పడింది. మూడు బౌండరీలతో కాన్ఫిడెంట్‌గానే కనిపించాడు. అయితే 46వ ఓవర్‌లో బౌల్ట్‌ వేసిన షార్ట్‌ పించ్‌ బంతిని వెంటాడి మరి కీపర్‌ క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. అయితే కీలక సమయంలో కోహ్లి ఔటైన తీరు విమర్శలకు దారి తీసే అవకాశం ఉంది. ఇక కోహ్లి ఔటవ్వడంతో టీమిండియా శిబిరంలో ఆందోళన నెలకొనగా.. కివీస్‌ శిబిరంలో గెలిచినంత ఆనందాన్ని పొందారు. 113 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్‌పై దాదాపు ఆశలు వదిలేసుకున్నట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అద్భుతాలు జరిగితే తప్ప కివీస్‌ నుంచి మ్యాచ్‌ను కాపాడుకునే అవకాశం లేదంటున్నారు. 

చదవండి:
టీమిండియా గెలిస్తే నిజంగా అదుర్సే..
‘జడేజానే నా ఫేవరెట్‌ ప్లేయర్‌’
ఆధిక్యం 51 నుంచి 183కు..

మరిన్ని వార్తలు