ఇంకో 43 కొట్టారు అంతే..

22 Feb, 2020 08:00 IST|Sakshi

వెల్లింగ్టన్‌: ఊహించిందే జరిగింది.. రహానే ఆదుకోలేదు.. పంత్‌ మెరవలేదు.. టెయిలెండర్లు చేతులెత్తేశారు. దీంతో ఆతిథ్య న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 165 పరుగులకే ఆలౌటైంది. ఓవరనైట్‌ స్కోర్‌ 122/5తో రెండో రోజు ఇన్నింగ్‌ ఆరంభించిన కోహ్లి సేన మరో 43 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లను కోల్పోయింది. పట్టుమని 15 ఓవర్లు కూడా టీమిండియాను బ్యాటింగ్‌ చేయనీయలేదు కివీస్‌ బౌలర్లు. ఆదుకుంటారని అనుకున్న వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే (138 బంతుల్లో 46; 4 ఫోర్లు), రిషభ్‌ పంత్‌ (19)లు తీవ్రంగా నిరాశపరిచారు. ముఖ్యంగా పంత్‌ రనౌట్‌ కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అశ్విన్‌ గోల్డెన్‌ డకౌట్‌ కాగా, షమీ(20 బంతుల్లో 21; 3ఫోర్లు) ధాటిగా ఆడటంతో టీమిండియా కనీసం 150 పరుగుల స్కోరైనా దాటగలిగింది.  రెండో రోజు ఆటలో సౌతీ మూడు వికెట్లు పడగొట్టగా..జేమీసన్‌ మరో వికెట్‌ దక్కించుకున్నాడు. 

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టానికి 70 పరుగులు చేసింది. ఇషాంత్‌ శర్మ వేసిన 11 ఓవర్లో టామ్‌ లాథమ్‌ (11) కీపర్‌ క్యాచ్‌ ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో​ బ్లండెల్‌ (30 బ్యాటింగ్‌), సారథి విలియమ్సన్‌ (29 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.  ఏ పిచ్‌పై అయిత మన బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేయడానికి ఇబ్బందులు పడ్డారో అదే పిచ్‌పై కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ సాదాసీదాగా బ్యాటింగ్‌ చేస్తున్నారు. అంతేకాకుండా మన పేస్‌ కివీస్‌ బ్యాట్స్‌మన్‌ను ఇబ్బందులు పెట్టలేకపోతోంది. 

చదవండి:
బోల్తా పడ్డారు...
రజతంతో సరిపెట్టుకున్న సాక్షి

మరిన్ని వార్తలు