రహానే కోసం పంత్‌ వికెట్‌ త్యాగం..

22 Feb, 2020 09:02 IST|Sakshi

వెల్లింగ్టన్‌: క్రికెట్‌లో రనౌట్‌ సర్వసాధారణం.. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రనౌట్‌ను సాధారణంగా తీసుకుంటారు.. కానీ టెస్టు క్రికెట్‌లో రనౌట్‌ను ఎవరు ఉపేక్షించరు.. అందులోనూ కష్టకాలంలో ఉన్న జట్టును ఆదుకోవాల్సిన సమయంలో అనవసర పరుగు కోసం యత్నించి రనౌట్‌ అవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా ఓ సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ అలా ఒక్క పరుగు కోసం ఆరాటపడి అవతలి ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ రనౌట్‌కు కారణం కావడం విడ్డూరంగా ఉంది. న్యూజిలాండ్‌-టీమిండియాల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఎవరూ ఊహించని రనౌట్‌ చోటుచేసుకుంది. 

ఓవరనైట్‌ స్కోర్‌ 122/5తో రెండో రోజు ఇన్నింగ్‌ ఆరంభించిన కోహ్లి సేనకు ఆదిలోనే షాక్‌ తగిలింది. రెండో రోజు ఆటలో భాగంగా 59 ఓవర్‌లో మెరుపులు మెరిపిస్తాడని భావించిన పంత్‌ రనౌట్‌ అయ్యాడు.  సౌతీ వేసిన 59 ఓవర్‌ రెండో బంతిని రహానే ఆఫ్‌సైడ్‌ తరలించి పరుగు తీయాలని ఆరాటపడ్డాడు. అయితే బంతి ఫీల్డర్‌ సమీపంలోకి రావడంతో అవతలి ఎండోలో ఉన్న పంత్‌ పరుగుకు తటపటాయించాడు. కానీ అప్పటికే సగం క్రీజు వరకు రహానే వచ్చి ఆగాడు. దీంతో చేసేదేమి లేక పంత్‌ కూడా పరుగు కోసం ప్రయత్నం ప్రారంభించాడు. అయితే అప్పటికే బంతి అందుకున్న అజాజ్‌ పటేల్‌ నేరుగా వికెట్ల మీదకు త్రో విసిరాడు. అప్పటికీ పంత్‌ క్రీజు చేరుకోకపోవడంతో రనౌట్‌ అయ్యాడు. దీంతో పంత్‌ భారంగా క్రీజు వదిలి వెళ్లాడు. 

ఇక ఈ అనూహ్య రనౌట్‌తో సారథి కోహ్లితో పాటు సహచర ఆటగాళ్లు, అభిమానులు తీవ్రంగా నిరుత్సాహపడ్డారు. అయితే ఇప్పటివరకు 64 టెస్టులు ఆడిన రహానే తన భాగస్వామి రనౌట్‌లో భాగం కావడం ఇదే తొలి సారి కావడం గమనార్హం. రహానేతో పాటు రోహిత్‌ శర్మలు ఇప్పటివరకు టెస్టు క్రికెట్‌లో రనౌట్‌లో భాగస్వామ్యం కాలేదు. ఇక పంత్‌ రనౌట్‌కు రహానే కారణమని నెటిజన్లు మండిపడుతున్నారు. ‘నెలకు పైగా రిజర్వ్‌ బెంచ్‌పైనే ఉన్నాడు.. పచ్చని పచ్చికపై ఆడే అపూర్వ అవకాశం దక్కింది. కానీ సీనియర్‌ ప్లేయర్‌ కోసం తన వికెట్‌ను త్యాగం చేశాడు. ఇలా చేయడం పంత్‌కే సాధ్యం’, ‘పంత్‌ రనౌట్‌తోనే టీమిండియా ఆలౌటైంది’ అంటూ మరొకొంత మంది నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా పేర్కొంటున్నారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 165 పరుగులకు ఆలౌటైంది. 

చదవండి:
బోల్తా పడ్డారు...
ఇంకో 43 కొట్టారు అంతే..

మరిన్ని వార్తలు