కివీస్‌తో రెండో టీ20: టీమిండియా లక్ష్యం 133

26 Jan, 2020 14:08 IST|Sakshi

ఆక్లాండ్‌: రెండో టీ20లో ఆతిథ్య న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ను టీమిండియా బౌలర్లు కట్టడి చేశారు. తొలి టీ20లో ఇదే పిచ్‌పై వీరవిహారం చేసిన కివీస్ జట్టు.. ఆదివారం జరుగుతునున్న రెండో టీ20లో మాత్రం పరుగులు చేయడానికి ఆపసోపాలు పడింది. దీంతో టీమిండియా ముందు 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కివీస్‌ నిర్దేశించింది. న్యూజిలాండ్‌ ఆటగాళ్లలో టిమ్‌ సీఫెర్ట్ (26 బంతుల్లో 33 నాటౌట్‌, 1 ఫోర్‌, 2 సిక్సర్లు), మార్టిన్‌ గప్టిల్‌(20 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్సర్లు)లు ఓ మోస్తారుగా రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(2/18), దుబె(1/16), ఠాకూర్‌(1/21), బుమ్రా(1/21)లు ఆకట్టుకున్నారు. వీరితో పాటు షమీ, చహల్‌లు వికెట్లు పడగొట్టకున్నా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి పరుగులు రాకుండా అడ్డుకున్నారు. 

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు తొలి మ్యాచ్‌ మాదిరి ఓపెనర్లు మెరుపు ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. కివీస్‌ విధ్వంసకర ఆటగాడు మున్రో క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో స్కోర్‌ బోర్డు నెమ్మదించింది. మరోవైపు గప్టిల్‌ దాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. ఇదే క్రమంలో శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి గప్టిల్‌ క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. దీంతో తొలి వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం కోలిన్‌ మున్రో కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలుచోలేదు. 

శివమ్‌ దుబె బౌలింగ్‌లో కోహ్లి స్టన్నింగ్‌ క్యాచ్‌కు మున్రో(26) భారంగా క్రీజు వదిలి వెళ్లాడు. కివీస్‌ను ఆదుకుంటాడనుకున్న సారథి కేన్‌ విలియమ్సన్‌ (14)తో పాటు గ్రాండ్‌హోమ్‌(3)లను టీమిండియా బౌలర్లు వెంటవెంటనే పెవిలియన్‌కు పంపించారు. తొలి మ్యాచ్‌లో వీరవిహారం చేసిన రాస్‌ టేలర్‌(24 బంతుల్లో 18)ను మన బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. బౌండరీల మాటు అటుంచితే పరుగులు చేయడానికే ఇబ్బందులు పడ్డాడు. అయితే చివర్లో టిమ్‌ సీఫెర్ట్‌ తన బ్యాట్‌కు పనిచెప్పడంతో కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగలకే పరిమితమైంది. 

మరిన్ని వార్తలు