హమ్మయ్య.. ఆధిక్యం నిలిచింది

1 Mar, 2020 08:45 IST|Sakshi

క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో టీమిండియా తొలి సారి ‘ఆధిక్యాన్ని’ ప్రదర్శించింది. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 7 పరుగుల అతి స్వల్ప ఆధిక్యం దక్కి ఊపిరిపీల్చుకుంది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 63/0తో రెండో రోజు ఆట ప్రాంభించిన కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది. టామ్‌ లాథమ్‌(52) అర్థసెంచరీతో రాణించాడు. లాథమ్‌ మినహా మరే బ్యాట్స్‌మన్‌ చెప్పుకోదగ్గ స్కోర్‌ సాధించకపోవడంతో ఓ క్రమంలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. అయితే కీలక సమయంలో  జేమీసన్‌(49) దాటిగా ఆడి టీమిండియాకు భారీ ఆధిక్యం దక్కకుండా అడ్డుకున్నాడు. జేమీసన్‌కు తోడు వాగ్నర్‌(21) భారత బౌలర్లను ప్రతిఘటించాడు. మహ్మద్‌ షమీ (4/81), బుమ్రా (3/62), జడేజా (2/22), ఉమేశ్‌ (1/46)లు రాణించారు. 

రెండో రోజు ఆట ప్రారంభం కాగానే కివీస్‌కు టీమిండియా బౌలర్లు షాక్‌ ఇచ్చారు. వరుసగా బ్లన్‌డెల్‌(30)ను ఉమేశ్‌ యాదవ్ వికెట్ల ముందు దొరకపుచ్చుకోగా.. సారథి విలియమ్సన్‌(3)ను బుమ్రా బొల్తాకొట్టించాడు. అనంతరం వచ్చిన కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ను భారత బౌలర్లు​ ఎక్కువ సేపు క్రీజులో నిలుచోనివ్వలేదు. వరుసగా రాస్‌ టేలర్‌ (15), హెన్రీ నికోలస్‌(14), వాట్లింగ్‌(0), గ్రాండ్‌హోమ్‌(26)లను పెవిలియన్‌కు పంపించారు. అయితే లాథమ్‌ అర్థసెంచరీతో రాణించినప్పటికీ అతడిని భారీ స్కోర్‌ సాధించకుండా అతడిని షమీ చాలా తెలివిగా ఔట్‌ చేశాడు. దీంతో 177 పరుగులకే కివీస్‌ 8 వికెట్లు కోల్పోవడంతో టీమిండియాకు భారీ ఆధిక్యం లభిస్తుందనుకున్నారు. 

అయితే రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ కివీస్‌ టెయిలెండర్లు భారత బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టారు. ముఖ్యంగా జేమీసన్‌ (49; 7ఫోర్లు) ఓ ప్రొఫెషన్‌ బ్యాట్స్‌మన్‌ను తలపిస్తూ బ్యాటింగ్‌ చేశాడు. వీలుచిక్కినప్పుడల్లా ఫోర్లు బాదుతూ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. జేమీసన్‌కు వాగ్నర్‌ (21) చక్కటి భాగస్వామ్యాన్ని అందించాడు. వీరిద్దరు 9 వికెట్‌కు 51 పరుగులు జోడించి కివీస్‌ను ఆధిక్యంవైపు నడిపించారు. అయితే షమీ బౌలింగ్‌లో జడేజా సూపర్బ్‌ క్యాచ్‌ అందుకోవడంతో వాగ్నర్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఆ వెంటనే జేమీసన్‌ను కూడా షమీ పెవిలియన్‌కు పంపించడంతో కివీస్‌ 235 పరుగులకు ఆలౌటైంది. 

చదవండి:
వాటే డైవ్‌.. పిచ్చెక్కించావ్‌ కదా!
మన ఆట మారలేదు

మరిన్ని వార్తలు