కోహ్లి ఔట్‌: అదే బంతి.. బౌలర్‌ మారాడంతే!

1 Mar, 2020 10:57 IST|Sakshi

క్రైస్ట్‌చర్చ్‌: ‘మార్చిలో ఓ లెక్క రాలేదు ఫెయిల్‌ అయ్యావు.. సెప్టెంబర్‌లో మళ్లీ అదే లెక్క వచ్చింది. ఏం చేస్తావ్‌.. ఈ లోపల ఏం నేర్చుకున్నావ్‌.. మార్చికి సెప్టెంబర్‌కు తేడా చూపించు’అని జులాయి సినిమా క్లైమ్యాక్స్‌ పవర్‌ ఫుల్‌ డైలాగ్‌ ఉంటుంది. ప్రస్తుతం ఇదే డైలాగ్‌ను టీమిండియా సారథి విరాట్‌ కోహ్లికి వర్తింపజేస్తూ నెటిజన్లు మీమ్స్‌ క్రియేట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సంబరం టీమిండియాకు ఎంతో సేపు నిలవేలేదు. ఏడు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ చేపట్టిన టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌ (3), పృథ్వీ షా(14) ఘోరంగా విఫలమయ్యారు. ఈ క్రమంలో టీమిండియా ఎన్నో ఆశలు పెట్టుకున్న కోహ్లి (14) సైతం మరోసారి దారుణంగా నిరుత్సాహపరిచాడు. 

ఈ సిరీస్‌లో పేలవ ఫామ్‌లో ఉన్న కోహ్లి రెండో ఇన్నింగ్స్‌లో గ్రాండ్‌హోమ్‌ వేసిన 18 ఓవర్‌ తొలి బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆఫ్‌సైడ్‌ ఫ్రంట్‌ ఫూట్‌ బంతిని అంచనా వేయడంలో మరోసారి తడబడిన కోహ్లి వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో అప్పటికే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను మరింత కష్టాల్లోకి నెట్టేస్తూ పెవిలియన్‌ బాట పట్టాడు. అయితే అవతలి ఎండ్‌లో ఉన్న పుజారా రివ్యూ తీసుకొమ్మని సూచించినా కోహ్లి నిరాకరించి క్రీజు వదిలి వెళ్లాడు. తర్వాత ఫర్ఫెక్ట్‌ అవుటని టీవీలో  తేలడంతో కోహ్లి మరోసారి డీఆర్‌ఎస్‌ అవకాశాన్ని వృథా​ చేయలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  తొలి ఇన్నింగ్స్‌లో టిమ్‌ సౌతీ వేసిన సేమ్‌ అదే బంతికే కోహ్లి అదేరీతిలో ఎల్బీడబ్ల్యూ కావడం గమనార్హం. 

2018లో కేప్‌టౌన్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సైతం కోహ్లి ఇదే విధంగా ఔటయ్యాడంటూ కామెంటేటర్లు పేర్కొన్నారు. ఇక ప్రపంచ నంబర్‌ వన్‌ బ్యాట్స్‌మన్‌ ఇలా పలుమార్లు ఒకే విధంగా ఔటవ్వడం విమర్శలకు ఊతమిచ్చే అవకాశం ఉంది. కోహ్లి ఆటతీరుపై నెటిజన్లు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌కు రెండో ఇన్నింగ్స్‌కు తేడా చూపించలేదని.. నేర్చుకోవడంలో సారథే వెనుకంజలో ఉంటే సహచర, యువ క్రికెటర్లు అతడి నుంచి ఏం నేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు. కాగా, కివీస్‌ టెయిలెండర్లు సులువుగా బ్యాటింగ్‌ చేసిన చోట భారత బ్యాట్స్‌మెన్‌ ఘోరంగా విఫలమవడాన్ని టీమిండియా ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. 

చదవండి:
కోహ్లి.. అందుకే విఫలం
సలాం జడ్డూ భాయ్‌..

>
మరిన్ని వార్తలు