సలాం జడ్డూ భాయ్‌..

1 Mar, 2020 09:36 IST|Sakshi

క్రైస్ట్‌చర్చ్‌: త్రీ డైమెన్షన్‌ ప్లేయర్‌కు పర్ఫెక్ట్‌ పర్యాయపదం రవీంద్ర జడేజానే అని మరో సారి రుజువైంది. బ్యాట్‌తో మెరుపులు మెరిపించగలడు.. బౌలింగ్‌తో మాయ చేయగలడు.. అంతకుమించి ఫీల్డింగ్‌తో మెస్మరైజ్‌ చేయగలడు. కివీస్‌తో జరుగుతున్న రెండో టెస్టుల్లో జడేజా సూపర్‌ మ్యాన్‌ను తలపించే ఓ విన్యాసం చేశాడు. మహ్మద్‌ షమీ వేసిన ఇన్నింగ్స్‌ 72వ ఓవర్‌ చివరి బంతిని వాగ్నర్‌ స్వ్కెర్‌ లెగ్‌లో భారీ షాట్‌ ఆడాడు. ఆ బంతి బౌండరీ వెళ్లడం పక్కా అన్నట్టు కెమెరా కూడా బౌండరీ లైన్‌నే చూపించింది. కానీ అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న జడేజా ఎవరూ ఊహించని విధంగా కళ్లు చెదిరే రీతిలో గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్‌ అందుకుని ఓ మై గాడ్‌ అనిపించాడు. ఆ ఊహించని సూపర్‌మ్యాన్‌ క్యాచ్‌కు వాగ్నర్‌ షాక్‌కు గురికాగా.. సహచర క్రికెటర్లు ఆనందంలో మునిగిపోయారు. 

ప్రస్తుతం రవీంద్ర జడేజా సూపర్‌ మ్యాన్‌ క్యాచ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ‘జడ్డూ కాదు జాదు’, ‘మానవమాత్రులకు సాధ్యం కాదు.. సూపర్‌ మ్యాన్‌ అతడు’, ‘సలాం జడ్డూ భాయ్‌’, ‘త్రీ డైమెన్షన్‌ ప్లేయర్‌ అంటే అర్థం జడేజా’ అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ‘రెండో రోజు ఆటలో జడేజా విభిన్న కోణాలను మనం చూశాం. తొలుత గ్రాండ్‌హోమ్‌ను బంతితో ఔట్‌ చేశాడు. అనంతరం వాట్లింగ్‌ను ఆ తర్వాత వాగ్నర్‌ను తన సూపర్‌ ఫీల్డింగ్‌తో ఔట్‌ చేశాడు’అంటూ హర్ష భోగ్లే ట్వీట్‌ చేశాడు.

 

చదవండి:
హమ్మయ్య.. ఆధిక్యం నిలిచింది
సెమీస్‌ రేసులో కివీస్‌... 

 

మరిన్ని వార్తలు