‘కాగితం, కత్తెర, బండ?’

11 Feb, 2020 20:35 IST|Sakshi

మౌంట్‌ మాంగనీ : టీమిండియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన చివరి వన్డేల్లో కేఎల్‌ రాహుల్‌-జిమ్మీ నీషమ్‌ల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. రాహుల్‌ బ్యాటింగ్‌ సందర్భంగా పరుగు తీసే క్రమంలో బౌలింగ్‌ చేస్తున్న నీషమ్‌ అడ్డుకున్నాడని రాహుల్‌ ఆరోపించాడు. అంతేకాకుండా ఇద్దరి మద్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ఫీల్డ్‌ అంపైర్‌ ఎంటర్‌ అయి వివాదాన్ని చక్కదిద్దాడు. మ్యాచ్‌ అనంతరం ఈ సంఘటనకు సంబంధించి ఓ ఫోటోను నీషమ్‌ షేర్‌ చేస్తూ.. ఓ ఫన్నీ కామెంట్‌ పెట్టాడు. రాహుల్‌, నీషమ్‌, అంపైర్‌ ఉన్న ఫోటోను షేర్‌ చేస్తూ కాగితం, కత్తెర, బండ? అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. అంతేకాకుండా ఏప్రిల్‌ కోసం కొన్ని పరుగులు దాచి ఉంచడం మరువకు అంటూ రాహుల్‌ను ఉద్దేశించి నీషమ్‌ ట్వీట్‌ చేశాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో రాహుల్‌, నీషమ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి విదితమే. ఈ తరుణంలోనే నీషమ్‌ పై విధంగా ట్వీట్‌ చేశాడు. 

ఇక అప్పటికే సిరీస్‌ కోల్పోయినప్పటికీ పరువు కోసం ఆడిన మ్యాచ్‌లో టీమిండియా మరోసారి ఘోర ఓటమి చవిచూసింది. బౌలింగ్‌, పీల్డింగ్‌ వైఫల్యంతో టీమిండియా 31ఏళ్ల తర్వాత వన్డేల్లో వైట్‌ వాష్‌ అయింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి సేనపై ఐదు వికెట్ల తేడాతో కివీస్‌ ఘన విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. 62 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను రాహుల్‌ సెంచరీతో ఆదుకున్నాడు. 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 112 పరుగులు సాధించడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోర్‌ను సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ 297 పరుగుల లక్ష్యాన్ని 47.1 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇక ఈ సిరీస్‌ ఆద్యంతం తన పరుగుల ప్రవాహంతో కివీస్‌కు విజయాన్నందించిన రాస్‌ టేలర్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు లభించింది. 
 

చదవండి:
‘క్రికెట్‌ దేవుడిని మరోసారి గెలిపించండి’ 
సెంచరీతో రాహుల్‌ రికార్డుల మోత..!

మరిన్ని వార్తలు