అనుకున్నంత కాకపోయినా.. పర్వాలేదు!

29 Jan, 2020 14:06 IST|Sakshi

హామిల్టన్‌: 8.5 ఓవర్లకు వికెట్‌ నష్టపోకుండా 89 పరుగులు. అప్పటికే వీరఫామ్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్‌, హాఫ్‌ సెంచరీతో రోహిత్‌ శర్మలు క్రీజులో ఉన్నారు. దీంతో టీమిండియా అవలీలగా రెండు వందలకుపైగా పరుగులు సాధిస్తుందనుకున్నారు. కానీ సీన్‌ కట్‌ చేస్తే ఏడు పరుగుల వ్యవధిలో మూడు కీలక వికెట్లు.. కట్టుదిట్టంగా కివీస్‌ బౌలింగ్‌. దీంతో అందరూ ఊహించనట్టుగా కివీస్‌ ముందు కోహ్లి సేన భారీ లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయింది. బుధవారం హామిల్టన్‌ వేదికగా జరిగిన మూడో టీ20లో కివీస్‌కు టీమిండియా 180 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.  టీమిండియా హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ (40 బంతుల్లో 65; 6ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీతో కివీస్‌పై ఫామ్‌లోకి రాగా.. సారథి విరాట్‌ కోహ్లి(38), కేఎల్‌ రాహుల్‌(27) ఫర్వాలేదనిపించారు. కివీస్‌ బౌలర్లలో బెన్నెట్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. గ్రాండ్‌హోమ్‌, సాంట్నర్‌లు తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

అదిరే ఆరంభం..
టాస్‌ గెలిచిన కివీస్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ టీమిండియాను బ్యాటింగ్‌కు అహ్వానించాడు. దీంతో ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్‌, రాహుల్‌లు చక్కటి శుభారంభాన్ని అందించారు. ముఖ్యంగా కివీస్‌పై పేలవ రికార్డులు కలిగి ఉన్న రోహిత్‌ ఈ మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ముఖ్యంగా బెన్నెట్‌ వేసిన ఆరో ఓవర్‌లో తాను ఎదుర్కొన్న ఐదు బంతులను మూడు సిక్సర్లు, రెండు ఫోర్లుగా మలిచాడు. ఈ ఓవర్‌లో ఏకంగా 27 పరుగులు లభించడం విశేశసం. దీంతో కేవలం 23 బంతుల్లోనే (5 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీ సాధించాడు. మరో వైపు కేఎల్‌ రాహుల్‌ నిదానంగా ఆడుతూ.. వీలుచిక్కినప్పుడలా బౌండరీలు బాదుతూ ఆకట్టుకున్నాడు. అయితే గ్రాండ్‌హోమ్‌ వేసిన 9వ ఓవర్‌ చివరి బంతిని భారీ షాట్‌కు యత్నించి రాహుల్‌ వెనుదిరిగాడు. అనంతరం బెన్నెట్‌ బౌలింగ్‌లో రోహిత్‌, శివమ్‌ దుబె(3)లు వెంటవెంటనే ఔటు కావడంతో 96 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. 

దీంతో టీమిండియాపై ఒక్కసారిగా ఒత్తిడి పెరిగిపోయింది. ఇదే క్రమంలో కివీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తూ పరుగులు రాకుండా అడ్డుకున్నారు. అయితే అయ్యర్‌తో కలిసి కోహ్లి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. పరుగుల వేగం తగ్గడం, కివీస్‌ ఎటాకింగ్‌ బౌలింగ్‌కు అయ్యర్‌, కోహ్లిలు ఇబ్బందులకు గురయ్యారు. అయితే స్కోర్‌ను పెంచే క్రమంలో సాంట్నర్‌ బౌలింగ్‌లో అయ్యర్‌(17) కూడా నిష్క్రమించాడు. దీంతో నాలుగో వికెట్‌కు 46 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. స్కోర్‌ బోర్డు 160 పరుగుల వద్ద ఉన్న సమయంలో టీమిండియాను బెన్నెట్‌ మరోసారి దెబ్బతీశాడు. కోహ్లిని ఔట్‌ చేసి కివీస్‌ శిబిరంలో ఆనందం నింపాడు. ఇక చివర్లో మనీశ్‌ పాండే (16 నాటౌట్‌), జడేజా(10 నాటౌట్‌)లు దూకుడుగా ఆడటంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. దీంతో అనుకున్నంత కాకపోయినా ఓ మోస్తారు స్కోర్‌నైనా సాధించింది టీమిండియా. 

టీమిండియా

వరల్డ్‌కప్‌ జట్టును గుర్తించాం: బ్యాటింగ్‌ కోచ్‌

సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా

మరిన్ని వార్తలు