ప్చ్‌.. హార్దిక్‌కు నో చాన్స్‌!

1 Feb, 2020 15:02 IST|Sakshi

న్యూఢిల్లీ:  న్యూజిలాండ్‌తో రెండు టెస్టు సిరీస్‌ కోసం భారత క్రికెట్‌ జట్టును ఇప్పటికే ఎంపిక చేయాల్సి ఉండగా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కోసమే ఆపుతూ వచ్చారు. కానీ మేనేజ్‌మెంట్‌ నిరీక్షణ ఫలించలేదు. హార్దిక్‌ పాండ్యా ఇంకా వెన్నుగాయం నుంచి కోలుకోపోవడంతో అతనిపై ఆశలను వదులుకున్నారు. కివీస్‌తో టెస్టు సిరీస్‌కు హార్దిక్‌ అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో విషయాన్ని వెల్లడించింది. ‘హార్దిక్‌కు సర్జరీ తర్వాత ఎన్‌సీఏ ఫిజియో ఆశిష్‌ కౌశిక్‌తో కలిసి మెడికల్‌ రివ్యూ కోసం లండన్‌కు వెళ్లాడు. కానీ ఇంకా మ్యాచ్‌లు ఆడటానికి హార్దిక్‌కు సమయం ఉందని డాక్టర్‌ జేమ్స్‌ అల్లీబోన్‌ తెలిపారు. దాంతో ఫుల్‌ ఫిట్‌నెస్‌ సాధించే వరకూ ఎన్‌సీఏలో ఆటగాళ్ల పునరావాస శిబిరంలోనే ఉంటాడు’ అని తెలిపింది. (ఇక్కడ చదవండి: పంత్‌ తోపన్నారు.. మరి ఎందుకు తీసుకోరు?)

దక్షిణాఫ్రికాతో జరిగిన టి20లో చివరిసారిగా భారత్‌కు ఆడిన హార్దిక్‌ వెన్ను గాయంతో ఆటకు దూరమయ్యాడు. అతని గాయానికి శస్త్ర చికిత్స కూడా జరిగింది. ఇటీవలే కోలుకోవడంతో  భారత్‌ ‘ఎ’ జట్టు తరఫున కివీస్‌ టూర్‌కు వెళ్లడం ఖాయమనిపించింది. కానీ చివరి నిమిషంలో ఫిట్‌నెస్‌ టెస్టులో విఫలం కావడంతో హార్దిక్‌ వైదొలగాల్సి వచ్చింది. దాంతో పాండ్యా స్థానంలో విజయ్‌ శంకర్‌ను భారత్‌-ఎ జట్టును కివీస్‌ పర్యటనకు పంపారు. కాగా, న్యూజిలాండ్‌తో భారత సీనియర్‌ జట్టుకు రెండు టెస్టుల సిరీస్‌ ఉండటంతో అప్పటికి హార్దిక్‌ ఫిట్‌నెస్‌ సాధిస్తాడని అనుకున్నారు. కానీ అతనికి ఇంకా విశ్రాంతి అవసరమని తేల్చడంతో కివీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేసే టెస్టు జట్టులో ముందుగానే చోటు కోల్పోయాడు. 

>
మరిన్ని వార్తలు