కౌర్‌ పవర్‌! 

10 Nov, 2018 01:24 IST|Sakshi

సాక్షి క్రీడావిభాగం :గత ఏడాది జులైలో వన్డే ప్రపంచ కప్‌ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై హర్మన్‌ ఆడిన తుఫాన్‌ ఇన్నింగ్స్‌ను ఎవరూ మరచిపోలేరు. నాడు కేవలం 115 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సర్లతో 171 పరుగులు సాధించి ఆమె అజేయంగా నిలిచింది. ఇప్పుడు మరో ప్రపంచ కప్‌ వచ్చింది. ఈసారీ హర్మన్‌ స్పెషల్‌ ఇన్నింగ్స్‌తో తన సత్తాను ప్రపంచానికి చూపించింది. బంతిని బలంగా బాదడమే మంత్రంగా పని చేసే టి20లో ఏకంగా శతకం సాధించడంలో కౌర్‌ పవర్‌ ఏమిటో కనిపించింది.సిక్సర్ల సునామీతో విరుచుకు పడిన ఈ ‘పంజాబ్‌ కీ షేర్‌ని’ తొలి టి20 సెంచరీతో భారత మహిళల క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకుంది. హర్మన్‌ షాట్లలో ఎంత పదును కనిపించిందంటే ఆమె కొట్టిన సిక్సర్లలో ఎక్కువ భాగం స్టాండ్స్‌లో పడ్డాయి. పురుషుల క్రికెట్‌లోనైనా, ఎలాంటి మైదానంలోనైనా అవి కచ్చితంగా సిక్సర్లుగా మారేవే!  శుక్రవారం కివీస్‌తో మ్యాచ్‌లో కౌర్‌ ఇన్నింగ్స్‌ నెమ్మదిగానే ప్రారంభమైంది.తాను ఎదుర్కొన్న తొలి 13 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసింది. అయితే వాట్కిన్‌ వేసిన పదో ఓవర్లో హర్మన్‌ ప్రతాపం ప్రారంభమైంది. ఈ ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో తన ఉద్దేశాన్ని చాటింది. ఆ తర్వాత ప్రత్యర్థి కెప్టెన్‌ సాటర్‌వెయిట్‌ వేసిన 14వ ఓవర్లో పండగ చేసుకుంది. 2 సిక్సర్లు, ఫోర్‌తో చెలరేగిన భారత కెప్టెన్‌... 33 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత ఆమెను ఆపడం న్యూజిలాండ్‌ తరం కాలేదు. మరుసటి ఓవర్లో వరుసగా 4, 6...ఆ తర్వాతి రెండు ఓవర్లలో కలిపి మరో రెండు ఫోర్లు, సిక్సర్‌ బాదింది.హర్మన్‌ 85 పరుగుల వద్ద మళ్లీ స్ట్రయికింగ్‌కు వచ్చే సమయానికి ఇన్నింగ్స్‌లో 8 బంతులే మిగిలాయి.

ఆమె సెంచరీ సాధించగలదా అనే సందేహం కనిపించింది. అయితే దానిని పటాపంచలు చేస్తూ 19వ ఓవర్‌ చివరి రెండు బంతులకు భారీ సిక్సర్లు కొట్టి 97కు చేరుకుంది. డెవిన్‌ వేసిన చివరి ఓవర్‌ మూడో బంతికి రెండు పరుగులు తీయడంతో భారత మహిళల క్రికెట్‌లో కొత్త చరిత్ర నమోదైంది.  అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు (మార్చి 8) పుట్టిన హర్మన్‌ అబ్బాయిలతో పోటీ పడి అసాధారణ క్రికెటర్‌గా ఎదిగింది.సెహ్వాగ్‌తో కలిసి ఓపెనింగ్‌ చేస్తావా అంటూ ఊర్లో కుర్రాళ్లు చేసిన వ్యంగ్య వ్యాఖ్యలకు సెహ్వాగ్‌లాంటి దూకుడైన ఆటతోనే జవాబు చెప్పింది. క్రికెట్‌ పిచ్చి ఉన్న తండ్రి ఆమె పుట్టినప్పుడు క్రికెటర్‌ బొమ్మ ఉన్న షర్ట్‌ తెచ్చి తొడగడం యాదృచ్ఛికమే కావచ్చు కానీ ఆయన ప్రోత్సాహంతో దేశం గర్వపడే క్రికెటర్‌గా ఎదిగేందుకు పట్టుదలతో శ్రమించింది. హర్మన్‌ మెరుపు బ్యాటింగ్‌ వెనక ఆమె అద్భుత ఫిట్‌నెస్‌ కూడా దాగి ఉంది. గత ఏడాది వన్డే ప్రపంచ కప్‌ తర్వాత జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఆమె రెండు సార్లు యోయో టెస్టుకు హాజరైంది.పురుష క్రికెటర్లకే సాధ్యం కాని రీతిలో తొలిసారి 17.2 స్కోరు నమోదు చేసిన ఆమె మరో ఐదు నెలలకు దానిని మెరుగుపర్చుకొని 18.5కి తీసుకొచ్చింది. దీనిని చూసిన యువరాజ్‌ సింగ్‌ ‘ఇంత స్కోరు చేశావా... అదీ ఇండోర్‌లో...అంతా బాగానే ఉంది కదా’ అంటూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. నువ్వు సెహ్వాగ్‌లాగానే ఆడుతున్నావంటూ యువీ ఇచ్చిన ప్రశంస ఆమెలో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఆటలోనే కాకుండా  సగటు పంజాబీ అమ్మాయిలలాగా మాటల్లో కూడా కౌర్‌ దూకుడు కనిపిస్తుంది. మైదానంలో సరిగా స్పందించని జట్టు సభ్యులపై ఆమె ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన ఘటనలు బోలెడు. అయితే పిన్న వయసులో భారత టి20 కెప్టెన్‌ కావడం నుంచి బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడిన తొలి భారత క్రికెటర్‌ వరకు అనేక ఘనతలు తన పేరిట లిఖించుకున్న హర్మన్‌ ఖ్యాతి తాజా ఇన్నిం గ్స్‌తో  శిఖరానికి చేరిందంటే అతిశయోక్తి లేదు.   

మరిన్ని వార్తలు