వారికి అవకాశం ఇచ్చాం... ఇక ఏం చేస్తాం: సౌతీ

2 Feb, 2020 17:37 IST|Sakshi

మౌంట్‌మాంగనీ: టీమిండియాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను చూసుకుంటే ఇక్కడ న్యూజిలాండ్‌ క్లీన్‌స్వీప్‌ కావడానికి వారి స్వీయతప్పిదాలే కారణమనే విషయాన్ని కాదనలేం. వరుసగా రెండు మ్యాచ్‌లను టై చేసుకుని సూపర్‌ ఓవర్‌ వరకూ తీసుకొచ్చి పరాజయాల్ని చూసిన కివీస్‌.. చివరి టీ20లో గెలుపు వాకిట చతకిలబడింది. సునాయాసంగా గెలుస్తుందనుకున్న తరుణంలో భారత్‌ బౌలింగ్‌కు దాసోహమైంది. 

ఈ సిరీస్‌లో టీమిండియా కడవరకూ పోరాడి సిరీస్‌ను వైట్‌వాష్‌గా ముగించగా, పోరాడటంలో కివీస్‌ విఫలం కావడంతోనే వారికి ఇంతటి పరాభవం ఎదురైంది. గతంలో వారి గడ్డపై భారత్‌కు ఎప్పుడూ టీ20 సిరీస్‌ను కోల్పోని కివీస్‌.. ఈసారి 5-0తో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. దాదాపు ఇదే విషయాన్ని చెబుతున్నాడు న్యూజిలాండ్‌ తాత్కాలిక సారథి టిమ్‌ సౌతీ. మ్యాచ్‌ తర్వాత అవార్డుల కార‍్యక్రమంలో సౌతీ మాట్లాడుతూ..‘ మరోసారి విజయానికి దగ్గరగా వచ్చి చతికిలబడ్డాం. దురదృష్టవశాత్తూ మరొకసారి అనవసర తప్పిదాలు చేశాం.(ఇక్కడ చదవండి; చివరి టీ20: ఇద్దరు కెప్టెన్లూ పక్కపక్కనే..)

టీమిండియాకు మేము అవకాశాలు కల్పించాం. చేతుల్లోకి వచ్చిందనుకున్న తరుణంలో తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాం. ఏ చిన్న అవకాశాన్ని టీమిండియా వదల్లేదు. ఇక ఏం చేసేది లేకుండా పోయింది. వచ్చిన అవకాశాల్ని  వారు రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నారు. మేము ఎక్కువ వ్యత్యాసంతో ఓడిపోలేదు. మేము చేసిన తప్పిదాలను సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. వన్డే ఫార్మాట్‌కు అన్ని విధాలుగా సమాయత్తం అవుతాం. వన్డే ఫార్మాట్‌ అనేది..టీ20కి చాలా భిన్నం. ఈ ఫార్మాట్‌లో మేము పటిష్టంగానే ఉన్నాం’ అని సౌతీ తెలిపాడు. (ఇక్కడ చదవండి: టీమిండియా క్లీన్‌స్వీప్‌)


 

మరిన్ని వార్తలు