అయ్యర్‌ అదరహో.. 

24 Jan, 2020 16:04 IST|Sakshi

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్‌ అదరగొట్టింది. న్యూజిలాండ్‌ నిర్దేశించిన 204 పరుగుల భారీ టార్గెట్‌ను ఇంకా ఓవర్‌ మిగిలి ఉండగానే ఛేదించి శుభారంభం చేసింది. రోహిత్‌ శర్మ(7) విఫలమైనా కేఎల్‌ రాహుల్‌(56; 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్‌ కోహ్లి(45; 32 బంతుల్లో 3ఫోర్లు, 1 సిక్స్‌), శ్రేయస్‌ అయ్యర్‌(58 నాటౌట్‌; 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) లు రాణించడంతో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓవరాల్‌గా కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లిలు ఆరంభంలో అదరగొడితే, శ్రేయస్‌ అయ్యర్‌ ఒత్తిడిని అధిగమిస్తూ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. న్యూజిలాండ్‌ బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగి శభాష్‌ అనిపించాడు. (ఇక్కడ చదవండి: రోహిత్‌.. నువ్వు సూపరో సూపర్‌!)

భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(7) నిరాశపరిచాడు. సిక్స్‌ కొట్టి ఊపుమీద కనిపించినా సాంట్నార్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. సాంట్నార్‌ వేసిన రెండో ఓవర్‌ నాల్గో బంతికి రాస్‌ టేలర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. కాగా, మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్ అదృష్టం కలిసొచ్చింది. బెన్నెట్‌ వేసిన ఆరో ఓవర్‌ రెండో బంతికి కవర్‌లోకి ఆడాడు. దానికి నాన్‌ స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న కోహ్లి పరుగు కోసం రాగా, రాహుల్ తటపటాయించాడు. అయితే కోహ్లి తన నిర్ణయాన్ని మార్చుకోకుండా ముందుకు సాగడంతో రాహుల్‌ క్రీజ్‌ను వదిలి రాకతప్పలేదు. ఆ సమయానికి రాహుల్‌ 27 పరుగుల వద్ద ఉండగా, అటు తర్వాత హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో అర్థ శతకం సాధించాడు. దాంతో భారత జట్టు 9 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 107 పరుగులు చేసింది. కాసేపటికి రాహుల్‌ ఔటైనప్పటికీ అయ్యర్‌ చక్కటి ఆట తీరుతో అలరించాడు.

కోహ్లి హాఫ్‌ సెంచరీకి చేరువగా వచ్చి పెవిలియన్‌ చేరినప్పటికీ అయ్యర్‌ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. కాసేపు శివం దూబే(13)కలిసి ఇన్నింగ్స్‌ రిపేర్‌ చేసిన అ‍య్యర్‌.. మనీష్‌ పాండే(14 నాటౌట్‌)తో కలిసి 62 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించాడు. ఈ క్రమంలోనే  26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 19 ఓవర్‌ చివరి బంతికి సిక్స్‌ కొట్టి భారత్‌కు విజయం అందించాడు. దాంతో భారత్‌ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ ఐదు టీ20ల సిరీస్‌లో రెండో టీ20 ఆదివారం జరుగనుంది. (ఇక్కడ చదవండి: రాహులా.. ఇదే కదా అదృష్టం!)

ముందుగా బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌ ఆది నుంచి పరుగుల మోత మోగించింది. ఓవర్‌కు కనీసం పది పరుగులు తగ్గకూడదనే లక్ష్యంతో బ్యాట్‌ ఝుళిపించింది. పవర్‌ ప్లే ముగిసేసరికి కివీస్‌ వికెట్‌ కోల్పోకుండా 68 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 81 పరుగులతో ఉంది. దూబే వేసిన ఎనిమిదో ఓవర్‌ ఐదో బంతికి గప్టిల్‌(30; 19 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) భారీ షాట్‌ కొట్టడానికి యత్నించగా స్క్వేర్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న రోహిత్‌ శర్మ అద్భుమైన క్యాచ్‌ అందుకున్నాడు. దాంతో గప్టిల్‌ కథ ముగిసింది. ఆపై మున్రో (59; 42 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఔట్‌ కాగా, పరుగు వ్యవధిలో గ్రాండ్‌ హోమ్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. దాంతో కివీస్‌ 117 పరుగుల వద్ద మూడో వికెట్‌ను నష్టపోయింది. 

సాధారణంగా ఎక్కువగా స్ట్రైకింగ్‌ను రొటేట్‌ చేస్తూ సింగిల్స్‌, డబుల్స్‌కు ప్రాధాన్యత ఇచ్చే కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. బౌండరీలే లక్ష్యంగా రెచ్చిపోయాడు. కేవలం  26 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. విలియమ్సన్‌ పూనకం వచ్చినట్లు ఆడటంతో కివీస్‌ బోర్డు పరుగులు తీసింది. అతనికి రాస్‌ టేలర్‌ నుంచి కూడా చక‍్కటి సహకారం లభించింది. వీరిద్దరూ 61 పరుగులు జోడించి స్కోరు  బోర్డును గాడిలో పెట్టారు. కాగా, విలియమ్సన్‌ దూకుడుగా ఆడే యత్నంలో నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు.

చహల్‌ బాగా ఆఫ్‌సైడ్‌కు వేసిన బంతిని వెంటాడి షాట్‌కు యత్నించాడు. అయితే ఎడ్జ్‌ తీసుకోవడంతో పాయింట్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న కోహ్లి క్యాచ్‌ అందుకోవడంతో విలియమ్సన్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. కాగా, టేలర్‌ కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో న్యూజిలాండ్‌ రెండొందల మార్కును చేరింది.  టేలర్‌ 27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో  54 పరుగులతో అజేయంగా నిలిచాడు.  భారత బౌలర్లలో బుమ్రా, శార్దూల్‌ ఠాకూర్‌, శివం దూబే, చహల్‌, రవీంద్ర జడేజాలు తలో వికెట్‌ తీశారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా